రాజధాని రగడలో ‘‘ ఆ ’’ పదమే హాట్ హాట్.. నిగ్గుతేల్చేదెవరంటే?

ఇన్‌సైడర్ ట్రేడింగ్… నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి నెట్టేందుకు వైసీపీ ఉపయోగించిన పదబంధమిది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇదే పదం ఇప్పుడు అధికార వైసీపీ నేతలపై అస్త్రంగా వాడుకోవడం మొదలుపెట్టాయి టీడీపీ. జనసేన పార్టీలు. మొన్నటి వరకు రాజధాని పేరిట అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ జరిగిందన్న బాణాన్ని వైసీపీ సంధిస్తే, ఇప్పుడు టీడీపీ, జనసేన కూడా అదే బాణాన్ని ఎక్కుపెడుతున్నాయి. విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు ఆరువేల ఎకరాల భూములు కొన్నారని, అందుకే అక్కడ ఎగ్జిక్యూటివ్‌ […]

రాజధాని రగడలో ‘‘ ఆ ’’ పదమే హాట్ హాట్.. నిగ్గుతేల్చేదెవరంటే?
Follow us

|

Updated on: Dec 18, 2019 | 5:40 PM

ఇన్‌సైడర్ ట్రేడింగ్… నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి నెట్టేందుకు వైసీపీ ఉపయోగించిన పదబంధమిది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇదే పదం ఇప్పుడు అధికార వైసీపీ నేతలపై అస్త్రంగా వాడుకోవడం మొదలుపెట్టాయి టీడీపీ. జనసేన పార్టీలు. మొన్నటి వరకు రాజధాని పేరిట అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ జరిగిందన్న బాణాన్ని వైసీపీ సంధిస్తే, ఇప్పుడు టీడీపీ, జనసేన కూడా అదే బాణాన్ని ఎక్కుపెడుతున్నాయి. విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు ఆరువేల ఎకరాల భూములు కొన్నారని, అందుకే అక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అంటున్నారని ఆరోపణలు సంధిస్తున్నారు. మరోవైపు రాజధానులు ఎక్కడెక్కడ ఉండాలన్నది కేంద్రానికి సంబంధం లేదని బీజేపీ అంటోంది. ఇంకోవైపు మూడు రాజధానుల ముచ్చట చెబుతున్న జగన్‌ సర్కార్‌, భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామంటోంది. మొత్తమ్మీద రాజధాని చుట్టూ సాగుతున్న రచ్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.

ఏపీలో మూడు రాజధానుల ఫార్ములాపై విశాఖ, కర్నూలులో హర్షం వ్యక్తమైతే, అమరావతి ప్రాంతంలో వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులు ధర్నాలు చేశారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో ఆందోళన చేపట్టారు. అటు ఈ ఫార్ములాను గట్టిగా వ్యతిరేకిస్తున్న టీడీపీ కొత్త వాదన తెరమీదకు తెచ్చింది. విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు ఆరువేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీబీఐ ఎంక్వైరీ వేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని టీడీపీ సవాల్ చేస్తోంది. టీడీపీతోపాటు జనసేన కూడా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అన్న ఆరోపణను అస్త్రంగా మలచుకుంటోంది. టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు, జనసేన నేత కందుల దుర్గేశ్ మాటల్లో ఆరోపణలు బలంగానే వినిపించాయి.

మూడు రాజధానుల ప్రకటనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇదే పాయింట్‌పై బీజేపీ స్పందించింది. రాజధాని ఎక్కడ ఉండాలో, ఎన్ని ఉండాలో అన్న అంశంతో కేంద్రానికి సంబంధం లేదని కమలనాథులు చెబుతున్నారు. సింగిల్ రాజధానిని పేర్కొంటూ అధికార భవనాలను వికేంద్రీకరించుకోవచ్చని బిజెపి అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు అంటున్నారు. కర్నూలులో ఏపీ హైకోర్టు పెట్టి, అమరావతిలో ఒక బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన సూచిస్తున్నారు.

రాజధానికి లక్షా 9 వేల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి తేవాలంటూ ప్రశ్నించి, సాగునీటి, మౌలిక వసతుల ప్రాధాన్యాలను అసెంబ్లీలో జగన్‌ వివరించిన నేపథ్యంలో భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటన్న అంశం కీలకంగా మారింది. అయితే రైతులకు న్యాయం చేస్తారని మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

రాజధాని వ్యవహారమంతా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంశం చుట్టూ తిరుగుతోంది. వైసీపీ కొన్ని ఆధారాలను బయటపెట్టింది. టీడీపీ, జనసేన తమ వాదనకు బలం చేకూరే లెక్కలు బయటపెడతాయా అన్నదే ఆసక్తిగా మారింది.