Big warning ఆ నీళ్లు తాగకూడదు. పండ్లు తినకూడదు

Big warning ఆ నీళ్లు తాగకూడదు. పండ్లు తినకూడదు

ఆంధ్రప్రదేశ్ లోని ఆ ప్రాంతంలో నీళ్లు తాగకూడదు. వాడకూడదు. జలకాలాట అసలు పనికిరాదు. పశువులకు మంచిది కాదు. అక్కడ పండిన ఆకుకూరలు, కూరగాయాలు, పండ్లు తినేందుకు పనికిరావు. బహిర్గతంగా ఉన్న ఆహార పదార్థాలు ఏవి తినకూడదు.

Rajesh Sharma

|

May 09, 2020 | 4:32 PM

ఆంధ్రప్రదేశ్ లోని ఆ ప్రాంతంలో నీళ్లు తాగకూడదు. వాడకూడదు. జలకాలాట అసలు పనికిరాదు. పశువులకు మంచిది కాదు. అక్కడ పండిన ఆకుకూరలు, కూరగాయాలు, పండ్లు తినేందుకు పనికిరావు. బహిర్గతంగా ఉన్న ఆహార పదార్థాలు ఏవి తినకూడదు. ఇందుకు విరుద్దంగా చేస్తే ప్రజల ప్రాణాలకే ముప్పు పొంచి ఉంది.

విశాఖపట్నం జిల్లాలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో స్టెరీన్ గ్యాస్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీక్ అయిన గ్యాస్ ప్రభావంతో 12 మంది చనిపోగా…వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. కొందరు కోలుకోగా…మరికొందరి పరిస్థితి ఇంకా విషమంగా మారుతోంది. వెంకటాపురంతో పాటు..ఐదు గ్రామాల ప్రజలు ఊరికి దూరంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వారు అప్పుడే రావద్దనేది నిపుణులు చెబుతున్న మాట. వాతావరణంలో పాలిమర్ కారక విష రసాయనాలు ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా వాతావరణంలో సుమారు ఆక్సిజన్ 22 శాతం, నెట్రోజన్ 72 శాతం, మిగతావి బాష్పవాయువులు ఉంటాయి.

వెంకటాపురం ప్రాంతంలో గాలిలోకి గ్యాస్ లీక్ అయిన సమయంలో ఉష్ణోగ్రత 22కు మించి లేదు. సంఘటన జరిగాక గాలిలో నెట్రోజన్ శాతం 68కి తగ్గింది. అలానే ఆక్సిజన్ 16 నుంచి 19కి తగ్గింది. ఇక బాష్పవాయువుల తీవ్రత ఎక్కువైంది. బాష్పవాయువు నుంచి వెలువడిన ఆవిర్లు కళ్లలోని బాష్ప గ్రంథులపై రసాయనిక చర్య జరుపుతాయి. అందువల్ల కళ్లలో మంటపుట్టి కన్నీరు ఎక్కువగా వస్తుంది. కనుగుడ్లపై ఎక్కువగా నీరు చేరడంతో చూపు కూడా మందగిస్తుంది. కనురెప్పలు వాస్తాయి. బాష్ప వాయువు శరీరంలోని వాయు నాళాల ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి కడుపులో వికారం పుట్టి వాంతులు కూడా అవుతాయి.

చర్మంపై బొబ్బలు వస్తాయి. ఈ సంఘటన జరిగింది తెల్లవారు జామున కావడంతో ఉష్ణోగ్రత తక్కువగా ఉంది. ఫలితంగా ప్రమాద తీవ్రత తగ్గింది. గ్యాస్ లీక్ అయిన సమయంలో గాలి విసురుగా వీస్తే మిగతా ప్రాంతాలకు వేగంగా విస్తరించేంది. అది జరగలేదు. అయినా అప్పటికే 5 కిలోమీటర్ల పరిధిలో దాని ప్రభావం చూపింది. ఫలితంగా ఇళ్లల్లో ఉన్న వాళ్లు బయటకు రాలేక పోయారు. ఒకవేళ వచ్చినా ఆ గాలి పీల్చి ఎక్కడి వారు అక్కడే కింద పడిపోయారు. శ్వాస తీసుకోవడం కష్టమైంది. చాలా మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

ఇప్పుడు అక్కడ స్టెరీన్ గ్యాస్ పాలిమర్ రూపంలో ఉంది. ఇళ్లు, పొలాల్లో, చెట్ల పై అది పేరుకుపోయింది. దానిమీద వర్షం పడితే తప్ప తొలగి అవకాశం లేదు. ఇళ్ల పైనున్న వాటర్ ట్యాంక్ లకు మూతలు లేకపోతే అందులో పాలిమర్ కలిసే అవకాశముంది. కాబట్టి తమ ఇళ్లల్లో అప్పటికే నిల్వ ఉన్న వాటర్ తాగేందుకు వాడుకునేందుకు పనికిరాదు. అంతే కాదు…సమీపంలో ఉన్న మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ నీటిని వినియోగించరాదు. బావులు, కుంటలు, చెరువుల్లో నీరు కలుషితంగా మారింది. పొలాల్లో ఉన్న చిన్న కుంటల్లో నీటిని వాడకూడదు. వెంకటాపురంతో పాటు…విశాాఖకు తాగునీటిని మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ నుంచి అందిస్తున్నారు.

గ్యాస్ లీక్ అయిన ప్రాంతంలోనే ఈ రిజర్వాయర్ ఉంది. సూక్ష్మ రేణువుల రూపంలో ఇక్కడ పాలిమర్ వ్యాపించింది. జలాశయంపై ఉన్న గడ్డి, నాచు, పాచిమీద అది అంటుకుంది. ఒకవేళ లోపల ఉంటున్న జలారాశులు ఏవైనా పైకి వచ్చి వాటిని తింటే ఇబ్బంది పడక తప్పదు. చేపలు, తాబేళ్లు, పాములు, కప్పులు వంటివి ఆ రిజర్వాయర్ లో ఉంటే పాలిమర్ ప్రభావానికి లోనవుతాయి. అందుకే ఆ నీరు తాగేందుకు పనికి రావు. అంతే కాదు…ఆ నీటిలో ఈత వేసేందుకు కుదరదు. అలా చేస్తే చర్మం పై దద్దుర్లు వస్తాయి. మిగతా ఇబ్బందులు తలెత్తుతాయి. కొత్త నీరు వస్తే తప్ప ఇబ్బందులు అంతే ఉంటాయి. ఫిల్టర్ బెడ్స్ ద్వారా నీటిని వడపోసినా ఎంతో కొంత సూక్ష్మ రూపంలో పాలిమర్ కణాలు ఉంటాయి. కాబట్టి వాడకానికి పనికి రావంటున్నారు.

పంట పొలాలు కలుషితం అయి పంటల మీద పాలిమర్ ప్రభావం ఉంటోంది. అక్కడ పండిన పంటలు తినేందుకు అనుకూలం కాదు. ఓపెన్ గా ఉండే బావుల నీటిది అదే తీరు. వాడకానికి పనికి రావు. పెద్ద ఎత్తున వర్షం వచ్చి నీరు కొట్టుకు పోవడం గానీ..ఆ నీరు ఎండిపోవడం గానీ జరిగితే పాలిమర్ ప్రభావం తగ్గుతోంది. అంతే తప్ప పూర్తిగా వాడేందుకు పనికి రావనేది నిపుణులు చెబుతున్న మాట. వాయు రూపంలో స్టెరీన్ గ్యాస్ పాలిమర్ కింద మారుతోంది. పాలిమర్ జడపదార్థం. అది మనిషి శరీరంలోకి వెళితే విషవాయువును ఉత్పత్తి చేస్తోంది. ప్రాణాలకు ప్రమాదాన్ని తీసుకువస్తోంది.

ప్రస్తుతం అక్కడున్న పరిస్థితుల్లో కూరగాయాలు, ఆకుకూరలు, తినే పండ్లు, పెరట్లో చెట్లకు కాసిన కాయలు తినకూడదు. అలానే ఇంట్లో తెచ్చి పెట్టుకున్న కూరగాయాలు, మిగతా పదార్థాలు కూడ వాడకూడదు. కవర్ లో చుట్టిన వాటిని తప్ప..బహిర్గతంగా ఉన్న ఆహార పదార్థాలు ఏవి తినవద్దు. అలానే ఇళ్ల మీద మూత లేకుండా ట్యాంకుల్లో ఉన్న నీటిని వినియోగించకూడదు. పాలిమర్ నీటిలో కలిసిపోతోంది. తద్వారా ఆ నీటిని తాగితే దుష్పప్రభావాలు ఉంటాయి. కిడ్నీ, లివర్, గుండె. రక్తనాళాలకు ఇబ్బంది.

అంతే కాదు.. క్యాన్సర్ వచ్చే వీలుంది. ఆ వాతావరణంలో దుమ్ము, ధూళీ పేరుకుపోయి ఉంటోంది. దాన్ని అంటుకుని చేతులు కడుక్కోకుండా ముక్కు రాసుకోరాదు. కళ్లు నులుముకోవద్దని చెబుతున్నారు నిపుణులు. రిజర్వాయర్ నీళ్లు మళ్లీ వర్షాలు పడే వరకు దుమ్ము, ధూళీ కొట్టుకొని పోయి భూమిలోకి ఇంకుతోంది. అప్పటికీ తీవ్రత తగ్గుతుందే గానీ..పూర్తిగా సమస్య పోయిందనుకోవడానికి వీలు లేదు. అందుకే తస్మాత్ జాగ్రత్త.

  • కొండవీటి శివనాగ్ రాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ-9

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu