Lock down 4.0 ఏపీలో ఇక అన్ని దుకాణాలు ఓపెన్
ఏపీలోని అన్ని రకాల దుకాణాలను తెరుచుకునేలా లాక్ డౌన్ నిబంధనలను సడలించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

All shops to be opened in Andhra Pradesh from tomorrow: ఏపీలోని అన్ని రకాల దుకాణాలను తెరుచుకునేలా లాక్ డౌన్ నిబంధనలను సడలించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో కేంద్రం నిర్దేశించినట్లుగా కాకుండా కర్ఫ్యూను రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం అయిదు గంటల వరకే అమలు పరచాలని కూడా జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.
నాలుగో విడత లాక్ డౌన్ అమల్లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం గతంలో వున్న పలు ఆంక్షలను సడలించుకునే వెసులుబాటును రాష్ట్రాలకు కలిగించింది. వాటిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ సోమవారం ఉదయం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. కోవిడ్ –19 పట్ల భయాందోళనలు పోవాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. వలస కార్మికులను ఆదుకునే విషయంలో అధికారులు బాగా పనిచేశారని ఆయన ప్రశంసించారు.
లాక్ డౌన్ నాలుగో దశలో పలు వెసులుబాట్లను కల్పించారు. రాష్ట్రంలో అన్ని రకాల దుకాణాలను తెరుచుకునే చాన్స్ కల్పించారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచుకోవచ్చు. అయితే ప్రతి దుకాణంలో 5గురు మాత్రమే వుండాలని నిబంధన విధించింది ప్రభుత్వం. పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు 50 మందికే అనుమతిస్తారు. రెస్టారెంట్ల వద్ద టేక్ అవేకు అనుమతించబోతున్నారు. అయితే, టేక్ అవే సమయంలో భౌతిక దూరం పాటించాల్సి వుంటుంది.
కోవిడ్ లక్షణాలు ఉన్నవారు తమకు తాము స్వచ్చందంగా ఆరోగ్య పరిస్థితులను తెలియజేయడంపై దృష్టిపెట్టాలని సీఎం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు తెలియజేశారు. ప్రజల్లో ఆందోళన, భయం తొలగిపోయేలా పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహించాలన్నారు. వార్డు క్లినిక్స్ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. విలేజ్, వార్డు క్లినిక్స్ ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరయ్యేలా చూడాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆదేశాలు సంబంధిత శాఖల అధికారులు ఆదేశాలు జారీ చేయనున్నారు.




