మిథున రాశిలో శుక్రుడు.. వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది..!
Shukra Gochar 2026: మే 15 నుంచి జూన్ 6 వరకు శుక్రుడు మిథున రాశిలో సంచరించనుండటంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశుల వారికి సుఖసంతోషాలు, ఆర్థిక లాభాలు, శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Venus Transit 2026: శుభ గ్రహమైన శుక్రుడి రాశి మార్పు మీదే సుఖ సంతోషాలు, సమస్యల పరిష్కారం, శుభకార్యాలు, శుభ పరిణామాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. శుక్రుడు ఉచ్ఛ క్షేత్రంలో ఉన్నా, స్వస్థానాల్లో ఉన్నా, మిత్ర క్షేత్రాల్లో ఉన్నా కొన్ని రాశులవారు మూడు నాలుగు వారాల పాటు నిశ్చింతగా, హ్యాపీగా బతికే అవకాశం ఉంటుంది. ఈ నెల(మే) 15 నుంచి జూన్ 6 వరకు శుక్రుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశులకు అదృష్టం తలుపు తట్టబోతోంది.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ధన స్థానంలో ప్రవేశించడం వల్ల సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. అన్ని వైపుల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం కలుగుతుంది. ఆస్తి సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- మిథునం: ఈ రాశిలో శుక్రుడి ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సగటు వ్యక్తి కూడా కొద్ది ప్రయత్నంతో సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
- సింహం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపా రంగా లాభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటివి జరుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.
- కన్య: ఈ రాశికి దశమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. ఒక సంస్థలో సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా సమయం అనుకూలంగా ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అంచనాలను మించిన రాబడిని ఆర్జిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు ప్రవేశించడం వల్ల విదేశీ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశాల్లో ఉన్నవారికి స్థిరత్వం కలుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి, సంపద కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర సంచారం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక వెలుగు వెలుగుతారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)