Telugu Astrology: ఆ రాశులకు చంద్ర బలం.. మరో వారంలో మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి..!
జూన్ 27–29 మధ్య వృశ్చిక రాశిలో చంద్రుడికి నీచభంగ రాజయోగం ఏర్పడనుంది. దీని ప్రభావంతో మేషం, వృషభం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి మానసిక ఒత్తిళ్లు తగ్గి ప్రశాంతత లభించే అవకాశం ఉంది. కోరికలు నెరవేరడంతో పాటు కొన్ని కీలక సమస్యలు, వివాదాల నుంచి కూడా ఉపశమనం కలగవచ్చని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

ఈ నెల(జూన్) 27, 28, 29 తేదీల్లో చంద్రుడు తనకు నీచ స్థానమైన వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ నీచబడ్డ చంద్రుడిని వృషభ రాశి నుంచి కుజుడు, కర్కాటక రాశి నుంచి గురువు వీక్షించడం వల్ల చంద్రుడికి నీచభంగం కలిగింది. చంద్రుడిని కుజ, గురువులు వీక్షించడం వల్ల కొన్ని రాశులవారికి మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, అలజడి పూర్తిగా తగ్గడంతో పాటు, మానసిక ప్రశాంతత, మనశ్శాంతి ఏర్పడతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఈ శుభ ఫలితాలు పొందబోతున్నారు.
- మేషం: వృశ్చిక రాశిలో ఉన్న చంద్రుడిని రాశ్యధిపతి కుజుడు, గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగ, కుటుంబ, ఆస్తి సంబంధమైన సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి తగ్గడం, ఊరట చెందడంతో పాటు మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. కొద్ది రోజుల పాటు ఈ రాశివారు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది.
- వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న చంద్రుడికి నీచభంగం జరగడం, గురు, కుజులు వీక్షించడం వల్ల పదోన్నతికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోయి మానసికంగా ఊరట కలుగుతుంది. సోదరులు, ఇతర దగ్గర బంధువులతో విభేదాలు, వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఏ ప్రయత్నమైనా నెరవేరుతుంది. ఆదాయ వృద్ధి, పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
- కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడిని గురు, కుజులు వీక్షించడం వల్ల నీచభంగం కలిగింది. దీనివల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. అవమానాల స్థానంలో రాజపూజ్యాలు చోటు చేసుకుంటాయి. జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. అనారోగ్యానికి సరైన చికిత్స లభించి మానసికంగా ఊరట కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు, ఒత్తిళ్లు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన సొమ్ము, బాకీలు వసూలవుతాయి.
- వృశ్చికం: ఈ రాశిలో నీచబడ్డ చంద్రుడిని గురు కుజులు వీక్షించడం వల్ల ఈ రాశివారి జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొద్ది ప్రయత్నంతో ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశం ఉంది. తల్లితండ్రుల ఆరోగ్యం కుదుటపడి మానసికంగా ఊరట చెందుతారు. ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గుతాయి. వివాదాల్లో ఉన్న వారసత్వ సంపద చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీత భత్యాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు మంచి విదేశీ ఆఫర్లు అందుతాయి.
- మకరం: ఈ రాశికి లాభ స్థానంలో చంద్రుడికి నీచభంగం కలగడం వల్ల ఈ రాశివారికి అనేక ఆదాయ వృద్ధి మార్గాలు అందివచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ నూరు శాతం ఫలితాలనిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమై మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ ఏర్పడుతుంది. పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటి బాగా లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- మీనం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న చంద్రుడిని రాశ్యధిపతి గురువు, కుజుడు చూడడం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఆగిపోయిన పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు పూర్తవుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం భారీగా పెరగడానికి అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)



