
వాస్తు ప్రకారం ఇంట్లో వివిధ రకాల మొక్కలను పెంచడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అందులో గన్నేరు మొక్కకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది “గన్నేరు మొక్క ఇంట్లో పెంచితే దురదృష్టమా?” అనే సందేహం పడుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం గన్నేరు పువ్వులు పవిత్రత, శుభప్రదతకు ప్రతీకగా భావిస్తారు.
గన్నేరు పువ్వులు తెలుపు, గులాబీ, పసుపు వంటి అందమైన రంగుల్లో పూస్తాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ కలహాలు జరుగుతున్నట్లయితే, గన్నేరు మొక్కను పెంచడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతారు. ఆ మొక్క పూలతో నిండితే కుటుంబంలో శాంతి, అన్యోన్యత పెరుగుతుందని విశ్వసిస్తారు.
ప్రత్యేకంగా లక్ష్మీదేవికి గన్నేరు పువ్వులు ఎంతో ప్రీతికరమని భావిస్తారు. తెల్ల గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం, శుభఫలితాలు పెరుగుతాయని నమ్మకం. అలాగే పసుపు రంగు గన్నేరు పువ్వులు శ్రీమహావిష్ణువుకు ఇష్టమైనవిగా భావిస్తారు. ఈ పూలతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే సంపదాభివృద్ధి కలుగుతుందని చెబుతారు.
వాస్తు ప్రకారం గన్నేరు మొక్కలను సరైన దిశలో ఉంచడం కూడా ముఖ్యమే. తెల్ల గన్నేరు మొక్కను తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని అంటారు. పసుపు గన్నేరు మొక్కను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తూర్పు వైపున ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.
వేద జ్యోతిషశాస్త్రంలో కూడా గన్నేరు పువ్వులకు ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా మంగళ దోష నివారణకు ఈ పూలను ఉపయోగిస్తారని విశ్వాసం. అందుకే ఇంట్లో గన్నేరు మొక్కలను పెంచి, నిత్యం పూజలో ఈ పువ్వులను వినియోగిస్తే సానుకూల శక్తి పెరిగి అదృష్టం కలిసివస్తుందని చెబుతారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)