Telugu Astrology: బాధక గ్రహం ఎఫెక్ట్.. ఆ రాశుల వారికి అడుగడుగునా అడ్డంకులే..!
Badhaka Graha: జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక 'బాధక గ్రహం' ఉంటుంది, అది అడ్డంకులు సృష్టిస్తుంది. చర, స్థిర, ద్విస్వభావ రాశులకు బాధక గ్రహాలు వేరుగా ఉంటాయి. కొత్త సంవత్సరంలో మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీన రాశులకు ఈ బాధక గ్రహాల వల్ల వృత్తి, ఆర్థిక, కుటుంబ సంబంధాలలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిని ఎలా అధిగమించాలో తెలుసుకోండి.

Badhaka Graha Effect
జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశివారికి ఒక ‘బాధక’ గ్రహం ఉంటుంది. బాధక గ్రహమంటే అడ్డంకులు, అవరోధాలు, అడ్డంకులు సృష్టించే గ్రహం. ఈ బాధక గ్రహం స్థితిగతులను బట్టి ఒక వ్యక్తి జీవితంలో ఏ రకమైన అడ్డంకులు ఉంటాయన్నది తెలుస్తుంది. చర రాశులైన మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు 11వ స్థానాధిపతి, స్థిర రాశులైన వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు 9వ స్థానాధిపతి, ద్విస్వభావ రాశులైన మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు 7వ స్థానాధిపతి బాధకులవుతారు. కొత్త సంవత్సరంలో మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీన రాశులను బాధక గ్రహాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
- మేషం: ఈ చర రాశికి 11వ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు బాధకాధిపతి. ప్రస్తుతం ఈ శని వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో పురోగతికి అడ్డుపడే అవకాశం ఉంది. ఈ రాశివారికి రహస్య శత్రువులుంటారు. కింది స్థాయి ఉద్యోగుల నుంచి సమస్యలుంటాయి. కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. కొందరు మిత్రులు శత్రువులుగా మారడం జరుగుతుంది. సుమారు ఏడాదిన్నర పాటు ఈ కుట్రలు, కుతంత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.
- సింహం: ఈ రాశివారికి 9వ స్థానాధిపతి అయిన కుజుడు బాధకాధిపతి. సాధారణంగా సమీప బంధువులు, సోదరుల వల్ల పురోగతికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థికంగా ఎదగడానికి వీరు తరచూ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహచరులు అవరోధాలు సృష్టిస్తూ ఉంటారు. తండ్రి నుంచి కూడా సమస్యలు ఉండవచ్చు. వీరు సొంత ఊర్లో కంటే దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం మంచిది. ఈ ఏడాదిలో ఎక్కువ కాలం కుజుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశికి 9వ స్థానాధిపతి అయిన చంద్రుడు బాధకాధిపతి. తల్లితండ్రుల నుంచి ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ, చేయూత ఉండకపోవచ్చు. కొందరు సన్నిహితులు ఆర్థికంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఏదో విధంగా అడ్డంకులు, అవరోధాలు సృష్టిస్తుంటారు. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా మోయవలసి రావడం వల్ల వ్యక్తిగత పురోగతి మీద దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏడాదంతా ఇటువంటి సమస్యలు కొనసాగే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
- ధనుస్సు: ఈ రాశివారికి 7వ స్థానాధిపతి అయిన బుధుడు బాధకాధిపతి. జీవిత భాగస్వామి నుంచి, జీవిత భాగస్వామి తరఫు బంధువుల నుంచి సమస్యలుంటాయి. ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, అడ్డంకులు సృష్టించడం జరుగుతుంది. వ్యక్తిగత పురోగతికి బాగా శ్రమపడాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములు, ఉద్యోగంలో సహోద్యోగుల సమస్యలుంటాయి. తల్లి వైపు బంధువులు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఏడాదంతా బంధువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
- కుంభం: ఈ రాశివారికి 9వ స్థానాధిపతి అయిన శుక్రుడు బాధకాధిపతి కావడం వల్ల తండ్రి వైపు బంధువుల వల్ల పురోగతి కుంటుపడే అవకాశం ఉంటుంది. తండ్రి పరిస్థితి బాగా లేకపోవడం వల్ల తండ్రి నుంచి సహకారం లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో పురోగతి ఉండకపోవచ్చు. దూర దృష్టి లోపం, అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోతుంటారు. ఉద్యోగంలో సహాయ నిరాకరణ ఎక్కువగా ఉంటుంది. ఏడాదిలో శుక్రుడు అనుకూలంగా లేనప్పుడు మాత్రమే ఆటంకాలు కలుగుతాయి.
- మీనం: ఈ రాశివారికి ఏడవ స్థానాధిపతి అయిన బుధుడు బాధకాధిపతి. ఉద్యోగంలో సహోద్యోగుల వల్ల, వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల బాగా ఇబ్బందులుంటాయి. వారి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభించకపోవచ్చు. జీవిత భాగస్వామి నుంచి కూడా ఆటంకాలు, అవరోధాలు ఉండవచ్చు. వ్యాపార భాగస్వాములు కూడా సమస్యలు సృష్టిస్తుంటారు. వీటన్నిటివల్ల వ్యక్తిగత పురోగతి స్తంభిస్తూ ఉంటుంది. బుధుడి సంచారం అనుకూలంగా ఉన్నప్పుడు ఈ సమస్యలు తగ్గవచ్చు.