Astro Tips in Telugu
Astrology in Telugu: జ్యోతిష శాస్త్రంలో దైవానుగ్రహాన్ని కూడా ఒక యోగంగా చెప్పడం జరిగింది. నిజానికి ఈ యోగం మిగిలిన అన్ని యోగాలకంటే మించిన యోగం. సహజశుభ గ్రహాలైన గురు, శుక్ర, బుధ, పూర్ణ చంద్రుడు గానీ, ఆధిపత్య శుభ గ్రహాలు కానీ అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ దైవానుగ్రహ యోగం ఏర్పడుతుంది. ఇది ఒక విధమైన అదృష్ట యోగం. ప్రధానమైన కష్టాల నుంచి బయటపడడం, అనారోగ్యం నుంచి విముక్తి లభించడం, ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి రావడం, పెళ్లి కావడం వంటివి ఈ కోవలోకే వస్తాయి. ఇందులో ఎవరి సమస్యలు వారివి. ఇవి పరిష్కారం అయినప్పుడు తప్పకుండా వారికి దైవానుగ్రహం ఉన్నట్టే భావించాలి. ఈ ఏడాది ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుందో, ఏ విధంగా దైవానుగ్రహం అనుభవానికి వస్తుందో పరిశీలిద్దాం.
- మేషం: ఈ రాశివారు ఈ ఏడాది ప్రధానంగా వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యల నుంచి బయట పడడం జరుగుతుంది. ఈ రాశికి గురు గ్రహంతో పాటు జీవన కారకుడైన శనీశ్వరుడు చాలా వరకు అనుకూలంగా ఉండడం వల్ల, ఈ రాశివారు అనుకూలమైన లేదా ఆశించిన ఉద్యోగంలోకి మారడం, ఉద్యోగంలో పైకి వెళ్లడం, వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం సంపాదించడం వంటివి అనుభవా నికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడం, ఆరోగ్యం బాగుపడడం వంటివి జరుగుతాయి.
- వృషభం: ఈ రాశివారికి బుధ, శుక్ర గ్రహాలతో పాటు, శనీశ్వరుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల, ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడి, ఆర్థిక సంబంధమైన కష్టాల నుంచి బయటపడడం జరుగు తుంది. ఒక ప్రణాళిక ప్రకారం, పద్ధతి ప్రకారం జీవితాన్ని ముందుకు తీసుకు వెడతారు. కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. జీవితంలో మంచి గుర్తింపు లభించడంతో పాటు ఎదుగుదల ఉంటుంది. దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి లభిస్తుంది.
- మిథునం: గురు, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల, దైవానుగ్రహం బాగానే ఉందని చెప్ప వచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఈ రాశివారికి తిరుగుండదు. ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు తమ తమ రంగాలలో అత్యధికంగా అభివృద్ధి సాధించడం జరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆశించిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. అనారోగ్యం నుంచి కోలుకోవడం జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి శుభ గ్రహాలేవీ అనుకూలంగా లేనప్పటికీ, ఆధిపత్య శుభ గ్రహమైన కుజుడు అనుకూలంగా ఉన్నందువల్ల, వృత్తి, ఉద్యోగ సంబంధమైన కష్టనష్టాల నుంచి చాలావరకు ఉపశమనం పొందే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో ఈ రాశివారి మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో విభేదాలు, వివాదాలు, అపార్థాలు చాలావరకు తొలగిపోయి, సామరస్య వాతావరణం ఏర్పడుతుంది.
- సింహం: ఈ రాశివారికి శుభ గ్రహమైన గురువుతో పాటు, ఆధిపత్య శుభుడైన కుజుడి అనుకూలత కూడా ఉన్నందువల్ల, ఆస్తి కలసి రావడం, ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం కావడం, ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉండడం, సంతానం లేని వారికి సంతానం కలగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. జీవితం చాలావరకు ప్రశాంతంగా సాగిపోతుంది. జీవితానికి సంబంధించిన ప్రణాళి కలు ఒక్కొటొక్కటిగా నెమ్మదిగా విజయం సాధిస్తాయి. పిల్లల సమస్యలు పరిష్కారం అవుతాయి.
- కన్య: ఈ రాశివారికి ఒక్క బుధ గ్రహమే అనుకూలంగా ఉన్నందువల్ల కెరీర్ పరంగా కొద్దిపాటి అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఉన్న సమస్యలు పరిష్కారం అయి, పురోగతికి సంబంధించిన మార్గం సుగమం అవుతుంది. బోధన, పరిశోధన, విద్య, వైజ్ఞానికం వంటి రంగాలలో ఉన్నవారికి ఆశించిన స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా దూర ప్రాంతాలకు, ఇష్టమైన ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. ఆర్థికంగా కొద్దిగా కలిసి వస్తుంది.
- తుల: ఈ రాశివారికి సహజ శుభ గ్రహాలైన గురు, బుధ గ్రహాలు, ఆధిపత్య శుభుడైన శనీశ్వరుడు అను కూలంగా ఉండడం వల్ల, మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయి, మనశ్శాంతి ఏర్పడుతుంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉండడంతో పాటు, ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడుతుంది. ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది.
- వృశ్చికం: రాశి అధిపతి అయిన కుజుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల జీవితం సాఫీగా గడిచిపోవడానికి అవకాశం ఉంది. అవసరానికి డబ్బు అందడం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, పిల్లలకు సంబంధించి శుభవార్తలు వినడం, కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోవడం చెప్పుకో దగ్గ అదృష్టాలు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో కొద్దిపాటి లాభాలే కనిపిస్తాయి. ఆధ్యాత్మిక చింతనలో ఆశించినంతగా పురోగతి కనిపిస్తుంది.
- ధనుస్సు: దైవానుగ్రహానికి సంబంధించిన శుభ గ్రహాలలో ఎక్కువ భాగం ఈ రాశివారికి అనుకూలంగా ఉండడం వల్ల, ఈ రాశివారు ఏ పని తలపెట్టినా విజయవంతం కావడం, మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరడం, దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కోలుకోవడం, బాగా డబ్బు కలిసి రావడం వంటివి జరుగుతాయి. అప్రయత్నంగా కూడా ఆదాయం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చాలావరకు మాట చెలామణీ అవుతుంది.
- మకరం: ఈ రాశివారికి ఆధిపత్య శుభుడు, రాశి అధిపతి అయిన శనీశ్వరుడు బలంగానూ, అనుకూలం గానూ ఉన్నందువల్ల ఎటువంటి కష్టనష్టాలనైనా ఎదుర్కోగల సత్తా లభిస్తుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఏ పని తలపెట్టినా కొద్దిగా ఆలస్యంగానైనా విజయవంతం అవుతుంది.
- కుంభం: ఈ రాశివారికి బుధ, శుక్ర గ్రహాలు కొద్దిగా అనుకూలంగా ఉన్నందువల్ల, వృత్తి, వ్యాపారాలు ఒడి దుడుకులు లేకుండా సజావుగా సాగిపోవడం, కుటుంబ జీవితంలో ప్రశాంతత ఏర్పడడం, పిల్లలు వృద్ధిలోకి రావడం వంటి చిన్నపాటి శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా యథాతథ స్థితి కొనసాగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది.
- మీనం: ఈ రాశి నాథుడు, శుభగ్రహం అయిన గురువు అనుకూలంగా ఉండడం వల్ల, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో కూడా శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆలయాలు సందర్శించడం, తీర్థయాత్రలు చేయడం జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి