YSRCP: వైసీపీ తీన్‌మార్ స్కెచ్.. ఆ మూడు నియోజకవర్గాలపైనే స్పెషల్ ఫోకస్..
'వై నాట్ 175'.. వచ్చే ఎన్నికల కోసం సీఎం జగన్ టార్గెట్ ఇది. క్లీన్ స్వీప్ చేసి టీడీపీకి చెక్ పెడతామంటున్నారు. వీటిలో ఆ మూడు నియోజకవర్గాలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం జగన్. ఆయా నియోజకవర్గాల్లోని ప్రధాన నేతలను ఓడించడం కోసం ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇంతకీ ఎవరా ముగ్గురు.?ఎక్కడా నియోజకవర్గాలు.?
![YSRCP: వైసీపీ తీన్‌మార్ స్కెచ్.. ఆ మూడు నియోజకవర్గాలపైనే స్పెషల్ ఫోకస్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/01/giddalur-ysrcp-1.jpg?w=1280)
‘వై నాట్ 175’.. వచ్చే ఎన్నికల కోసం సీఎం జగన్ టార్గెట్ ఇది. క్లీన్ స్వీప్ చేసి టీడీపీకి చెక్ పెడతామంటున్నారు. వీటిలో ఆ మూడు నియోజకవర్గాలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం జగన్. ఆయా నియోజకవర్గాల్లోని ప్రధాన నేతలను ఓడించడం కోసం ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇంతకీ ఎవరా ముగ్గురు.?ఎక్కడా నియోజకవర్గాలు.?
వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్. ‘వై నాట్ 175’ అంటూ అన్ని సీట్లలో పాగా వేస్తామని చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే అభ్యర్థుల ఎంపికను కూడా పకడ్బందీగా చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజారిటీ కూడా సాధించాలనేది వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఉన్న సీట్లన్నీ ఒక ఎత్తయితే.. ఆ మూడు నియోజకవర్గాలు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం జగన్. ఆ స్థానాల్లో ప్రతిపక్ష అభ్యర్ధులను ఓడించడమే కాదు.. భారీ మెజారిటీతో గెలిచేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఆ మూడు స్థానాలు కుప్పం, మంగళగిరి, భీమవరం. ఎస్.! ఇక్కడ ప్రత్యర్థ పార్టీల అభ్యర్థుల ఓటమి కోసం ముఖ్య నేతలను సైతం రంగంలోకి దించారు.
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబును భారీ మెజారిటీతో ఓడించాలని సీఎం ఆలోచన.. అందుకే కుప్పంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు కూడా లేదని పదేపదే ఎద్దేవా చేస్తూ వచ్చారు. కుప్పం అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కుప్పంలో వైసీపీ తరపున భరత్‌ను చంద్రబాబుపై పోటీకి సిద్ధం చేశారు. స్వయంగా సీఎం జగన్ ఫోకస్ పెట్టడంతో పాటు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. చిత్తూరు జిల్లా వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్‌గా ఉన్న పెద్దిరెడ్డి కుప్పంలో గెలుపుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. చంద్రబాబు హయాంలో కుప్పంకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేకపోయారని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం అభివృద్ధి జరిగిందని విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.
మరో నియోజకవర్గం మంగళగిరి.. చంద్రబాబు కుమారుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానంలో కూడా విజయం సాధించేలా వైసీపీ ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తోంది. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై లోకేష్ ఓటమి పాలయ్యారు. ఈసారి ఆర్కే పార్టీ వీడటంతో గంజి చిరంజీవిని పోటీకి పెట్టారు సీఎం జగన్. బీసీ సామాజికవర్గానికి చెందిన చిరంజీవి.. గతంలో టీడీపీ తరపున పోటీ చేశారు. అయితే నారా లోకేష్‌కు అడ్డుకట్ట వేసి విజయం సాధించేలా చూడాల్సిన బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఇప్పటివరకూ గుంటూరు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్‌లుగా ఉన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ స్థానంలో విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే సాయిరెడ్డి మంగళగిరి పార్టీ నేతలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఇంతవరకూ మంగళగిరిలో ఒక్కసారి కూడా టీడీపీ గెలవలేదు. ఈసారి కూడా అవకాశం ఇవ్వొద్దని విజయసాయిరెడ్డి నేతలకు సూచిస్తున్నారు.
మరో కీలక స్థానం భీమవరం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరంతో పాటు గాజువాకలో కూడా పోటీ చేశారు. ఈసారి కూడా భీమవరం నుంచే బరిలో ఉంటారని సమాచారం. అందుకే కొన్నాళ్లుగా ఈ స్థానంపై వైసీపీ దృష్టి పెట్టింది. ఉమ్మడి గోదావరి జిల్లాల వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి భీమవరం స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గ్రంధి శ్రీనివాస్‌కు మళ్లీ టిక్కెట్ ఇచ్చింది వైసీపీ. పవన్ కళ్యాణ్ సామాజికవర్గం ప్రభావం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ మాత్రం తేడా రాకుండా గెలుపు కోసం లెక్కలు వేసుకుంటున్నారు వైసీపీ నేతలు. పవన్‌ను మరోసారి ఓడించడం ద్వారా తమ సత్తా చాటాలని అనుకుంటున్నారు. ఈ మూడు స్థానాల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం ద్వారా రెండు పార్టీల అధ్యక్షులు, టీడీపీ ముఖ్యనేత లోకేష్‌ను ఓడించేలా వైసీపీ అధిష్టానం ముందుకెళ్తోంది.