
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. స్థానిక సంస్థల కోటాలో జరిగిన నాలుగు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార YCP విజయం సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ గెలుపొందారు. కర్నూలులో డాక్టర్ మధుసూదన్ రావు, శ్రీకాకుళం నుంచి నర్తు రామారావు ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రెండు గంటల్లోనే స్థానిక కోటా ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడ్డాయి. ఇక ఎన్నికలు జరిగిన మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ల నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బ్యాలెట్ పత్రాలు కావడం, ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండటం వల్ల ఈ ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది. తెలుపు రంగు బ్యాలెట్ పత్రం, టీచర్లకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లు ముద్రించారు.
కడప-అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 14 మంది పోటీపడ్డారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ స్థానానికి 8 మంది బరిలో ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 37 మంది పోటీలు ఉన్నారు. బీజేపీ తరపున మాధవ్, టీడీపీ తరపున వేపాడ చిరంజీవి రావు, YCP తరపున సీతారామరాజు సుధాకర్ బరిలో ఉన్నారు.
కడప, అనంతపురం, కర్నూలు గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఏకంగా 49 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మూడు ప్రధాన పార్టీలతో పాటు 46 మంది ఇండిపెండెంట్ల ఓట్లు ఇక్కడ లెక్కించాల్సి ఉంటుంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి 22 మంది పోటీ చేశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు ఈ అర్థరాత్రి లోపు రావచ్చు. గ్రాడ్యుయేట్ ఎన్నికల బరిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటం, ప్రాధాన్యత క్రమంలో ఓట్లు లెక్కింపు ఉంటుంది కాబట్టి ఆ ఫలితం రావడానికి రెండు రోజులు పడుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు షిప్టుల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..