Andhra: ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్.. టాప్ స్కోర్ చేసిన ఫ్యాన్ పార్టీ
ఫ్యాన్ గట్టిగా తిరిగింది...! సైకిల్ కాస్త స్లో అయ్యింది...! గాజుగ్లాసు బాగానే సౌండ్ చేసింది...! యస్... ఏపీలో లోకల్‌బాడీ ఎలక్షన్స్ హీటెక్కించాయి. టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా-నేనా అన్నట్లు నడిచిన ఫైట్‌లో... వైసీపీ పైచేయి సాధించింది. అల్లర్ల కారణంగా పలుచోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఎన్నిక ఏదైనా తగ్గేదేలే అన్నట్లుగా ఉంది ఏపీ రాజకీయం. ఎమ్మెల్యే ఎన్నికైనా, ఎమ్మెల్సీ ఎలక్షనైనా… క్యాంపు నడవాల్సిందే, పొలిటికల్ కాక రేగాల్సిందే. లేటెస్ట్‌గా జరిగిన ఎంపీపీ, ఉపసర్పంచ్ ఎన్నికల్లోనూ ఇవే సీన్స్ కనిపించాయి. మొత్తం తొమ్మిది జిల్లాల్లో 28 ఎంపీపీలు, 23 వైస్ ఎంపీపీలతో పాటు పలుచోట్ల ఉపసర్పంచ్ ఎన్నికలు జరగ్గా… టీడీపీ, వైసీపీ మధ్య టగ్ ఆఫ్ వార్ అన్నట్లుగా నడిచింది. ఫైనల్‌గా ఫ్యాన్ పార్టీ పైచేయి సాధించింది.
ఎన్టీఆర్ జిల్లా మొదలుకొని… చిత్తూరు జిల్లా వరకూ మెజారిటీ ఎంపీపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, సత్యసాయి జిల్లా రొద్దంకి, తిరుపతి రూరల్, కర్నూలు జిల్లా వెల్దుర్ది, ప్రకాశం జిల్లా మార్కాపురం, బాపట్ల జిల్లా పీవీపాలెం, చిత్తూరు జిల్లా తవణంపల్లి, అన్నమయ్య జిల్లా రాయచోటి ఎంపీపీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. పలుచోట్ల నువ్వా-నేనా అన్నట్లు పోటీ ఉన్నప్పటికీ… ఫ్యాన్ పార్టీ సత్తా చాటింది.
ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ జోరు కాస్త తగ్గింది. పల్నాడు జిల్లా అచ్చంపేట, గుంటూరు జిల్లా దుగ్గిరాల, అల్లూరి జిల్లా జి.మాడుగుల, చిత్తూరు జిల్లా రామకుప్పంలోని ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీ స్థానాన్ని సైకిల్ పార్టీ గెలుచుకుంది. పక్కాగా గెలుస్తుందన్న మరికొన్ని స్థానాల్లోనూ టీడీపీ ఓడిపోవడం చర్చనీయాంశమైంది.
లోకల్‌బాడీ ఎలక్షన్స్‌లో ఈసారి జనసేన కూడా సత్తా చాటింది. కాకినాడ రూరల్ ఎంపీపీని కైవసం చేసుకుంది. వైసీపీకి పట్టున్న కాకినాడ రూరల్‌లో ఊహించని పరిణామాల మధ్య జనసేన గెలిచింది. 8 ఎంపీటీసీలతో…. వైసీపీ, జనసేన పార్టీలు సమవుజ్జీలుగా ఉన్నప్పటికీ వైసీపీ ఎంపీటీసీలు ఎన్నికకు గైర్హాజరవ్వడంతో ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఇక అల్లర్ల కారణంగా పలుచోట్ల ఎన్నిక వాయిదా పడింది. సత్యసాయి జిల్లాలోని రామగిరి, గాండ్లపెంటలో ఉద్రిక్త పరిస్థితులతో ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణతో ఎలక్షన్‌ను పోస్ట్‌పోన్ చేయడంతో పాటు… 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఇటు పల్నాడు జిల్లాలోని కారంపూడి, నరసరావుపేటలోని వైస్ ఎంపీపీల ఎన్నిక కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణ వల్ల వాయిదా పడింది.
మొత్తంగా… క్యాంపులకు సైతం తెరలేపిన లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో వైసీపీ టాప్ స్కోర్ చేయగా… టీడీపీ సత్తా చాటింది. ఇటు జనసేన కూడా మాంచి జోష్ కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..