YSR Pension Kanuka: ఏపీ వ్యాప్తంగా జోరుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం.. 89 శాతం మందికి చేరిన సొమ్ము

Janardhan Veluru

Updated on: Sep 01, 2021 | 7:16 PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైయస్‌ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం బుధవారం(సెప్టెంబర్ 1) కొనసాగింది.  తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీని వాలంటీర్లు చేపట్టారు. 

YSR Pension Kanuka: ఏపీ వ్యాప్తంగా జోరుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం.. 89 శాతం మందికి చేరిన సొమ్ము
YSR Pension Kanuka

Follow us on

YSR Pension Kanuka: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైయస్‌ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం బుధవారం(సెప్టెంబర్ 1) కొనసాగింది.  తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీని వాలంటీర్లు చేపట్టారు.  రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మంది వాలంటీర్లు లబ్ధిదారుల గడప వద్దకే వెళ్ళి, పెన్షనర్లకు వారికి రావాల్సిన సొమ్మును వారి చేతికే అందించే కార్యక్రమాన్ని కొనసాగించారు. సాయంత్రం ఆరున్నర గంటల వరకు మొత్తం 88.92 శాతం పెన్షన్ సొమ్మును లబ్ధిదారులకు అందించారు. ఆగస్టు నెల పెన్షన్ కింద జగన్ ప్రభుత్వం రూ.1382.62 కోట్ల రూపాయలను కేటాయించింది. సెప్టెంబర్ ఒకటో తేదీనే ఈ సొమ్మును మొత్తం 59,18,685 మంది లబ్ధిదారుల చేతికే అందించేందుకు ముందురోజే సచివాలయాల స్థాయిలో కార్యదర్శుల ఖాతాలకు ఈ సొమ్మును ప్రభుత్వం జమ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నా కూడా వాలంటీర్లు పెన్షనర్లకు ఫించన్‌ సొమ్మును అందించే కార్యక్రమానికి ఎక్కడా విరామం ఇవ్వలేదు. ఉత్సాహంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు. బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయానికే 52,62,993 మంది లబ్ధిదారులకు 1228.77 కోట్ల రూపాయల మేర పెన్షన్ల మొత్తాలను పంపిణీ పూర్తి చేశారు. మొత్తం మూడు రోజుల్లో పెన్షన్లను నూరుశాతం పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వాలంటీర్లు పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో రాష్ట్రస్థాయి మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి జిల్లా, మండల, పంచాయతీ స్థాయి అధికారులు పాల్గొన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, పలు వ్యాధులతో బాధపడుతున్న వారిని సామాజికంగా, ఆర్థికంగా ఆదుకునేందుకు వైయస్‌ఆర్ పెన్షన్ కానుక నెల మొదటి రోజునే వారి చేతికి అందించే కార్యక్రమాన్ని జగన్ సర్కారు చేపడుతోంది.

సాయంత్రం ఆరున్నర గంటల వరకు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 91.96 శాతం, వైయస్‌ఆర్ కడప జిల్లాలో 90.97 శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలో 90.93 శాతం, విజయనగరం జిల్లాలో 90.82 శాతం, నెల్లూరు జిల్లాలో 90.49 శాతం, కృష్ణాజిల్లాలో 89.81 శాతం, గుంటూరు జిల్లాలో 88.75 శాతం, అనంతపురం జిల్లాలో 88.48 శాతం, తూర్పుగోదావరిజిల్లాలో 87.87 శాతం, కర్నూలు జిల్లాలో 87.62 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 87.07 శాతం, ప్రకాశం జిల్లాలో 86.20 శాతం, విశాఖపట్నం జిల్లాలో 86.14 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయ్యింది. ఒకవైపు వర్షాలు జోరుగా కురుస్తున్నా, మొక్కవోని లక్ష్యంతో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీలో చూపిన కృషిని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు.

Also Read..

AP Pension Rules: “ఏ నెల పింఛను ఆ నెలలోనే..!” ఏపీలో పెన్షన్ వివాదంపై స్పందించిన సజ్జల.. ఫుల్ క్లారిటీ

కరోనా తరువాత వేగంగా విస్తరిస్తున్న చక్కర వ్యాధి.. వారికి స్క్రీనింగ్ పరీక్షలు అత్యవసరం!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu