CM Jagan: వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసిన సీఎం జగన్.. మరో గుడ్ న్యూస్ కూడా
లా నేస్తం పథకం కింద.. రాష్ట్రంలో అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,00,55,000 విడుదల చేసింది. బుధవారం సీఎం వైఎస్ జగన్ ఆ మొత్తాన్ని జూనియర్ లాయర్ల ఖాతాల్లో జమ చేశారు.
వైఎస్ఆర్ లా నేస్తం ద్వారా లబ్ధి పొందుతున్న జూనియర్ లాయర్లు పేదల పక్షాన నిలవాలన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ లా నేస్తం కింద 2వేల 11 మందికి కోటీ 55 వేలు తాడేపల్లి నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. పాదయాత్రలో భాగంగా జూనియర్ న్యాయవాదుల సమస్యలు విన్న తర్వాత ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు సీఎం. న్యాయవాదులకు తోడుగా ప్రభుత్వం ఉందన్న సంకేతాన్ని గట్టిగా చెప్పడం కోసం ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు. న్యాయవృత్తిలో ఉన్న వీళ్లకు మంచి జరిగితే.. ప్రభుత్వం చేసిన ఈ మంచి ద్వారా వాళ్ల మనసుల్లో మరొకరికి మంచి చేయాలన్న ఆలోచన పుడుతుందన్నారు.
చదువు పూర్తిచేసుకుని న్యాయవృత్తిలోకి వచ్చిన తర్వాత తొలి మూడు సంవత్సరాలు… వృత్తిలో ఊతమివ్వడానికి, వారు స్థిరపడటానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుందన్నారు. మూడున్నరేళ్లలో దాదాపు 4,248 మంది లాయర్లను ప్రతినెలా ఆదుకున్నట్లు సీఎం తెలిపారు. ఈ నగదును ఆరు నెలలకు ఒకసారి, సంవత్సరానికి రెండు దఫాలుగా ఇచ్చేటట్టుగా నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఒకేసారి పెద్ద అమౌంట్ ఇస్తే వాళ్ల అవసరాలకు కూడా ఉపయోగపడుతుందన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం 100 కోట్లతో లాయర్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అర్హులైన న్యాయవాదులకు లోన్స్, ఇన్యూరెన్స్, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందచేస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..