AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Lokesh: బనకచర్లతో తెలంగాణకు ఇబ్బందేంటీ..? జగన్ వల్ల ఏపీ పరువు పోయింది – లోకేశ్

కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై ఉన్నట్లే.. ఏపీకి చంద్రబాబు ఉన్నారని మంత్రి లోకేశ్ అన్నారు. విశాఖను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనే కుట్రే బనకచర్ల ప్రాజెక్టుపై జరుగుతోందని లోకేశ్ ఆరోపించారు.

Nara Lokesh: బనకచర్లతో తెలంగాణకు ఇబ్బందేంటీ..? జగన్ వల్ల ఏపీ పరువు పోయింది - లోకేశ్
Minister Lokesh
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jul 31, 2025 | 10:18 PM

Share

సింగపూర్ పర్యటన విజయవంతమైందని.. దాని ఫలితంగా వచ్చే ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తాము ఎంవోయూలు దగ్గర ఆగిపోలేదని.. ప్రతీ ఒక్కదాన్ని నేరుగా కార్యరూపంలోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. జూమ్ కాల్ ద్వారా ఆర్సెలర్ మిట్టల్‌ను ఆహ్వానించామన్న మంత్రి.. దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు ఏపీలోనే ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. 2019 నుంచి 2024 మధ్య బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా నాశనం చేశారని లోకేశ్ ఆరోపించారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చినా, జగన్ సర్కారు స్పందించలేదన్నారు. ‘అప్పట్లో చేసిన ఒప్పందాలను విచక్షణ లేకుండా రద్దు చేశారు. పారదర్శకతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రంపైనే అవినీతి ముద్ర వేశారు. అమరరాజా, లులూ వంటి సంస్థలను రాష్ట్రం నుంచి తరిమేశారు’’ అంటూ ఫైర్ అయ్యారు. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై ఉన్నట్లే.. ఏపీకి చంద్రబాబు ఉన్నారన్నారు. ఇప్పుడు విశాఖను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని స్పష్టం చేశారు.

టీసీఎస్‌కి ఇచ్చాం – హెరిటేజ్ ఇవ్వలేదు

ఏ రాష్ట్రం చేయని విధంగా టీసీఎస్‌కి ఎకరా రూ.99 పైసలకే భూమి కేటాయించామని లోకేశ్ తెలిపారు. దీనిపై వైసీపీ నేతలు కోర్టుకెళ్లడం సిగ్గుచేటని విమర్శించారు. అదే ధరకు హెరిటేజ్‌కు కూడా భూమిని ఇవ్వలేదని.. కేవలం యువతకు ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైసీపీ హయాంలో వచ్చిన పెట్టుబడుల కంటే తమ ప్రభుత్వం 14 నెలల్లో తెచ్చిన పెట్టుబడులే ఎక్కువ అని చెప్పారు. ఏపీకి పెట్టుబడులు రాకూడదని సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఈమెయిల్ పంపించారని లోకేశ్ ఆరోపించారు. ఆయనకు వైసీపీ నేతలతో సంబంధాలున్నట్లు తమ దగ్గర సమాచారం ఉందన్నారు. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే కలిసికట్టుగా పెట్టుబడుల కోసం పని చేస్తే. ఏపీలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకులు కంపెనీలకు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇలా లేఖలు రాస్తే.. చివరకు నష్టపోయేది తెలుగువారేనని వ్యాఖ్యానించారు.

తెలంగాణకు ఇబ్బందేంటీ..?

తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనే కుట్రే బనకచర్ల ప్రాజెక్టుపై జరుగుతోందని లోకేశ్ ఆరోపించారు. మిగులు జలాలను వాడితే తెలంగాణకు ఇబ్బంది ఏముంటుందన్నారు. అలాంటప్పుడు కాలేశ్వరం ఎందుకు కట్టారని ప్రశ్నించారు. ఏపీ భూభాగంలో ప్రాజెక్టు నిర్మించుకుంటే ఇబ్బంది ఏంటన్న మంత్రి.. తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు మేం అడ్డుకున్నామా అని అడిగారు.

రాప్తాడు ఘటనపై..

రాప్తాడు హెలికాప్టర్ ఘటనలో హెలికాప్టర్ చుట్టూ జనం గుమికూడాలంటూ జగన్ పిలిచినట్లు లోకేశ్ ఆరోపించారు. దాంతో రూ.16 లక్షల విలువైన హెలికాప్టర్ గ్లాస్ పగిలిపోయిందన్నారు. ఈ విషయాన్ని విచారణలో పైలట్ వెల్లడించినట్లు తెలిపారు. తల్లికి గిఫ్ట్ డీడ్ ఇచ్చినట్టు చేసి మళ్లీ లాగేసుకున్నాడన్నారు. అలాంటి వ్యక్తి నాయకుడు కావడం రాష్ట్రానికి శాపమేనని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగు ప్రజల సంక్షేమం కోసమే తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని.. తాము చేసే ప్రతి చర్య ఆ దిశగా ఉంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…