YCP Plan: భీమవరం ఫలితమే పిఠాపురంలో రిపీట్ కానుందా.. వైసీపీ ఫ్లాన్ ఇదేనా..?

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటం, అభ్యర్థుల ప్రకటన పూర్తయిన నేపథ్యంలో వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విపక్ష పార్టీల ఎత్తులను చిత్తు చేసేలాగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తమ రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఎలాగైనా ఢీ కొట్టాలని వ్యూహం రచిస్తున్నారు.

YCP Plan: భీమవరం ఫలితమే పిఠాపురంలో రిపీట్ కానుందా.. వైసీపీ ఫ్లాన్ ఇదేనా..?
Jagan Pawan Kalyan
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 20, 2024 | 7:37 PM

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటం, అభ్యర్థుల ప్రకటన పూర్తయిన నేపథ్యంలో వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విపక్ష పార్టీల ఎత్తులను చిత్తు చేసేలాగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తమ రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఎలాగైనా ఢీ కొట్టాలని వ్యూహం రచిస్తున్నారు. అందులో భాగంగానే జనసేన తరపున పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టడంతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కంటే తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తూ పవన్ కల్యాణ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుర్కోవాలని తన ముందున్న అన్ని అవకాశాలపై దృష్టి సారించారు.

అందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి జనసేన పార్టీ సానుభూతిపరులు ఆ పార్టీకి అండగా నిలిచిన ముఖ్య నేతలు అలాగే పవన్ కల్యాణ్ గతంలో పోటీ చేసిన స్థానంలో ఉన్న ముఖ్య నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇప్పటికే కాపు ఉద్యమ నేతగా పేరు ఉన్న ముద్రగడ పద్మనాభంను వైసీపీలోకి ఆహ్వానించిన వైఎస్ జగన్, తాజాగా జనసేన పార్టీలో 2019 నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆ పార్టీ సీనియర్ నేత మాకినీడు శేషు కుమారిని వైసీపీలో ఆహ్వానిస్తున్నారు. ఇక చాగోండి హరి రామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్ ను సైతం పార్టీలోకి తీసుకొచ్చారు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ మిధున్ రెడ్డి. ప్రస్తుతం వారి బాటలోనే మరికొందరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పవన్ కల్యాణ్ కు అండగా ఉంటారని భావించి వారందరినీ చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి దగ్గర చేసుకోవడంలో భాగంగానే వీరందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తోంది వైసీపీ. కొత్తగా వైసీపీలో చేరే వారందరికీ రెడ్ కార్పెట్ వేస్తున్నారు.

ఇటీవలే పవన్ కల్యాణ్ తన పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురం నుంచి బరిలో ఉంటానంటూ ప్రకటించిన నేపథ్యంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపు సామాజిక వర్గంలోని ముఖ్య నేతలను పార్టీలోకి ఆహ్వానించడంతోపాటు పవన్ కల్యాణ్ ఓటమి లక్ష్యంగా వైసీపీ పావులు కలుపుతోంది. ఇప్పటికే ఆ పార్టీ ఇంచార్జిగా ఉన్న మిథున్ రెడ్డికి పూర్తిస్థాయి బాధ్యతలను వైయస్ జగన్ అప్పగించారు. ఈ నేపథ్యంలో తెలవెనక రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న మిథున్ రెడ్డి అన్ని తానే చక్రం తిప్పుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఇంచార్జిగా ఉన్న మిథున్ రెడ్డి ప్రస్తుతం చేగొండి సూర్య ప్రకాష్, ముద్రగడ పద్మనాభం తో పాటు మాకినుడు శేషు కుమారి లాంటి ముఖ్య నేతలను పార్టీలోకి తీసుకురావడంలో కీరోల్ పోషించారట. అయితే ఈ చేరికలతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ఓటమి లక్ష్యంగా మరోసారి గెలిచి చూపించాలని కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో పాటు అన్ని మండలాలకు ప్రత్యేకంగా బాధ్యులను నియమించింది వైసీపీ. పవన్ కల్యాణ్ పోటీ చేస్తారన్న సమాచారంతో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన తప్పించి వంగా గీతను వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఉన్నత విద్యావంతురాలు కావడం సీనియర్‌గా పాలిటిక్స్ లో మంచి పేరు సంపాదించుకోవడంతో వంగా గీత గెలుపు సాధ్యమని వైసీపీ భావిస్తోంది. పవన్ కల్యాణ్ నేరుగా బరిలోకి దిగుతూ ఉండంటంతో ఎన్నికల్లో ఏమాత్రం ఫలితం తారుమారైనా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే నియోజకవర్గం పరిధిలో సామాజిక వర్గాల వారీగా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి పవన్ ఓటమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది.

ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కాపు సామాజిక వర్గం తర్వాత ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయా వర్గాలను దగ్గర చేసుకునేందుకు ఇంచార్జిలను సైతం వైసీపీ నియమించింది. అందులో రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న మిథున్ రెడ్డిని ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ టౌన్ బాధ్యతలను అప్పగించడంతో పాటు ముద్రగడ పద్మనాభం, పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దాడిశెట్టి రాజాలకు ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించింది వైసీపీ అధిష్టానం.

పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం తరువాత అత్యధిక ఓటు బ్యాంకు కలిగి ఉన్న మత్స్యకార కుటుంబాలతో, ఆయా సంఘాలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి దాడిశెట్టి రాజా. ఇక ముద్రగడ పద్మనాభం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుతో పాటు మిథున్ రెడ్డిలు ప్రత్యేకంగా నియోజకవర్గంలోని ప్రతి మండలాలకు ఇంచార్జిలుగా బాధ్యతలను అప్పగించింది వైసీపీ. తద్వారా ఆయా వర్గాలకు పార్టీని దగ్గర చేసుకుని పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా అడుగులు వేయబోతుంది వైసీపీ. అందులో భాగంగానే జనసేన పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన మాకినీటి శేషు కుమారిని వైసీపీలోకి ఆహ్వానించడం ద్వారా ఆ పార్టీకి దెబ్బకొట్టినట్లు అవుతుందని వైసీపీ భావిస్తోంది. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో నిలిచిన మాకినీటి శేషు కుమారికి ఉన్న సొంత బలం కూడా వైసీపీకి లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అయితే అది ఏ మేరకు ఫలితం అయినా కూడా పవన్ ఓటమికి వైసీపీకి లాభం చేకూరుతుందని లెక్కలు వేసుకుంటుంది.

దీనికి తోడు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణాల ఆధారంగానే పవన్ కల్యాణ్ వేస్తున్న ప్రతి అడుగులను వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాలని వైసీపీ భావిస్తోంది. పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న పవన్ కల్యాణ్‌కు భీమవరం ఫలితాన్ని మళ్లీ పిఠాపురంలో రిపీట్ చేయాలని వైసీపీ భావిస్తోంది. సామాజిక వర్గాల విషయంలో ఎప్పుడు కొత్త లెక్కలు చెప్పే పవన్ కల్యాణ్‌కు తన సామాజిక వర్గం అధికంగా ఉండే నియోజకవర్గాల్లోనే రెండోసారి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గం నుంచి పవన్ కల్యాణ్‌ను దెబ్బ కొట్టేలా వైసీపీ రంగం సిద్ధం చేస్తోంది. చూడాలి మరి ఈ విషయంలో వైసీపీ వేస్తున్న అడుగులు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles