ఒంటరి తనమే ఆమె పాలిట శాపమా..? ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య.. విషాదానికే విషాదంగా మారిన ఘటన..!

Vizianagaram District News: హైమావతికి మూడు సంవత్సరాల లతిక్ష అనే కుమార్తె, యోగాన్ష్ అనే ఏడాదిన్నర కొడుకు ఉన్నారు. అలా ఉద్యోగ నిమిత్తం హైమావతి ఇద్దరు పిల్లలతో విజయనగరంలోనే నివాసం ఉంటుంది. ప్రతి రోజు ఉదయం హైమావతి ఆఫీసుకెళ్తే తన పిల్లల ఆలనా పాలనా చూసేవారు ఎవరు లేకపోవడంతో.. నిత్యం చాలా ఇబ్బందులు పడుతుండేది. భర్త ఉద్యోగం హైదరాబాద్ కావడంతో అక్కడే ఉండేవాడు. అక్కడ నుండి విజయనగరంకు బదిలీపై రావడానికి తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కి రావడానికి స్థానికత అడ్డంకిగా..

ఒంటరి తనమే ఆమె పాలిట శాపమా..? ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య.. విషాదానికే విషాదంగా మారిన ఘటన..!
Hymavathi And Daughter

Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Sep 16, 2023 | 10:03 AM

విజయనగరం జిల్లా, సెప్టెంబర్ 16: విజయనగరం జిల్లాలో హృదయ విధార ఘటన చోటు చేసుకుంది. కలెక్టరేట్ రెవిన్యూ డిపార్ట్మెంట్‌లో సబార్డినేటర్‌గా పనిచేస్తున్న బి హైమవతి అనే ఉద్యోగి దారుణానికి పాల్పడింది. భర్త దూరంగా ఉండటంతో ఒంటరితనం భరించలేక తనతో పాటు తన ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబరకు చెందిన హైమావతికి నాలుగేళ్ల క్రితం హైదరాబాదుకు చెందిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కుమార్‌తో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది నెలలకు తండ్రి మరణం కారణంగా కారుణ్య నియామకాల్లో భాగంగా విజయనగరం జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో హైమావతికి ఉద్యోగం వచ్చింది. దీంతో హైదరాబాదులో ఉన్న భర్తకు దూరంగా విజయనగరం జిల్లాకు రావాల్సి వచ్చింది.

అయితే హైమావతికి మూడు సంవత్సరాల లతిక్ష అనే కుమార్తె, యోగాన్ష్ అనే ఏడాదిన్నర కొడుకు ఉన్నారు. అలా ఉద్యోగ నిమిత్తం హైమావతి ఇద్దరు పిల్లలతో విజయనగరంలోనే నివాసం ఉంటుంది. ప్రతి రోజు ఉదయం హైమావతి ఆఫీసుకెళ్తే తన పిల్లల ఆలనా పాలనా చూసేవారు ఎవరు లేకపోవడంతో.. నిత్యం చాలా ఇబ్బందులు పడుతుండేది. భర్త ఉద్యోగం హైదరాబాద్ కావడంతో అక్కడే ఉండేవాడు. అక్కడ నుండి విజయనగరంకు బదిలీపై రావడానికి తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కి రావడానికి స్థానికత అడ్డంకిగా మారింది. దీంతో కొన్ని నెలలుగా భర్త హైదరాబాదులో, హైమావతి విజయనగరంలోనే ఉంటూ వస్తున్నారు. హైమావతి కూడా తాను చేస్తున్న ఉద్యోగం వదులుకొని హైదరాబాద్ వెళ్ళటానికి ఇష్టపడలేదు. అలా ఆఫీస్‌కి వెళ్ళిన తరువాత తన చిన్నారుల ఆహారంతో పాటు ఇతర మౌలిక అవసరాలు తీర్చే వారు లేకపోవడంతో హైమావతి గత కొన్నాళ్లుగా మానసికంగా క్రుంగి పోతూ వచ్చింది.

అనేక అవస్థలు పడిన హైమావతి చేసేది లేక జీవితంపై విరక్తి చెంది తనువు చాలించటానికి సిద్ధపడింది. కానీ తనొక్కటే మరణిస్తే తన ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఏంటి..? వారిని చూసేవారు ఎవరు వారు ఎవరున్నారు..? వారిద్దరూ రోడ్డున పడతారని ఆలోచించిన హైమావతి తనతో పాటు ఇద్దరు చిన్నారులను కూడా హతమార్చేందుకు నిర్ణయానికి వచ్చింది. దీంతో రెండు రోజుల క్రితం ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ పురుగుల మందు కొని ఇంటికి వచ్చింది. ముందుగా తన ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు త్రాగించి, తర్వాత తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే కొద్దిసేపటి తర్వాత చిన్నారుల ఏడుపులు విన్న స్థానికులు వారి వద్దకు వచ్చి పరిస్థితి గమనించారు. హుటాహుటిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. అయితే తల్లి హైమావతి ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికే మరణించిగా, కుమారుడు యోగాన్స్ మరుసటి రోజు చికిత్స పొందుతూ మరణించాడు. ప్రస్తుతానికి కుమార్తె లక్షిత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాలిక పరిస్థితి కూడా విషమంగా మారింది. క్షణికావేశంలో హైమావతి తీసుకున్న నిర్ణయానికి తనతో పాటు కుమారుడు మరణించాడు. కాగా, కుమార్తె లక్షిత పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..