ఆపరేషన్ గరుడ ఏమైంది.. డ్రగ్స్ కంటైనర్ కేసులో పురోగతేంటి..

తీరంలో పోటెత్తుతున్న డ్రగ్స్‌ కెరటాలు.. విశాఖను కకావికలం చేస్తున్నాయ్‌. తనపై పడ్డ మత్తుముద్ర.. ఎప్పుడు చెరిగిపోతుందా అని ఎదురుచూస్తోంది ఉక్కునగరం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కంటైనర్ కేసు ఎక్కడిదాకొచ్చిందని ప్రశ్నిస్తోంది. జాతీయస్థాయిలో దుమారం రేపిన ఈ ఇష్యూలో.. సీబీఐ ఏం తేల్చింది? అసలు ఈ మత్తుదందా గుట్టు రట్టు చేసేందుకే మొదలెట్టిన ఆపరేషన్‌ గరుడ ఏమైంది?

ఆపరేషన్ గరుడ ఏమైంది.. డ్రగ్స్ కంటైనర్ కేసులో పురోగతేంటి..
Cbi Investigation

Edited By:

Updated on: May 24, 2024 | 8:14 PM

తీరంలో పోటెత్తుతున్న డ్రగ్స్‌ కెరటాలు.. విశాఖను కకావికలం చేస్తున్నాయ్‌. తనపై పడ్డ మత్తుముద్ర.. ఎప్పుడు చెరిగిపోతుందా అని ఎదురుచూస్తోంది ఉక్కునగరం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కంటైనర్ కేసు ఎక్కడిదాకొచ్చిందని ప్రశ్నిస్తోంది. జాతీయస్థాయిలో దుమారం రేపిన ఈ ఇష్యూలో.. సీబీఐ ఏం తేల్చింది? అసలు ఈ మత్తుదందా గుట్టు రట్టు చేసేందుకే మొదలెట్టిన ఆపరేషన్‌ గరుడ ఏమైంది? ఫాలో అప్‌ ఉందా.. లేక మొత్తానికే సిస్టం పడకేసిందా? ఒక్క వైజాగే కాదు యావత్‌ ఆంధ్రా అడుగుతున్న కొశ్చన్స్‌ ఇవి. విశాఖ పోర్టులో ఈ ఏడాది మార్చి 20న పట్టుబడ్డ కంటైనర్‌ కలకలం అంతా ఇంతా కాదు. యావత్‌ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా.. ఆంధ్రావైపు చూసేలా చేసింది. వేలకోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ఏపీకి చేరాయంటూ.. జాతీయస్థాయిలో దుమారం రేగింది. ఎన్నికల సమయంలో రాజకీయ హడావుడి సృష్టించిన ఈకేసులో పురోగతి.. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రెండునెలలైంది కంటైనర్‌ దొరికి.. మరి, నిజంగా అందులో డ్రగ్సే ఉన్నాయా? అవి మత్తుపదార్థాలేనని నిర్దారణ అయ్యిందా? అనే విషయం మాత్రం తేలలేదు.

మార్చి 21.. అంటే కంటైనర్‌ పట్టుబడిన మర్నాడే.. హడావుడిగా ఢిల్లీ నుంచి వచ్చేసింది సీబీఐ బృందం. ఆపరేషన్ గరుడ పేరుతో దర్యాప్తు మొదలెట్టేసింది. నార్కోటిక్స్ డ్రగ్స్‌ను కలిపిన 25 వేల కేజీ ల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించి కేసు నమోదుచేసింది. తీరంలో సీబీఐ అధికారులు చేసిన ఈ హడావుడితో దేశమంతా విశాఖ వైపు చూసింది. డ్రగ్ మాఫియాకు విశాఖే కేంద్రం అయిపోయిందన్నట్టుగా.. ఆరోపణలు గుప్పుమన్నాయి. ఒక్కోటి 25 కేజీలు.. మొత్తం 1000బ్యాగులు.. అందులో 49 బ్యాగుల నుంచి శాంపిల్స్‌ను ర్యాండమ్‌గా పరిశీలించి.. నార్కోటిక్ డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించింది సీబీఐ. ఈ కేసులో సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ ప్రైవేటు లిమిటెడ్‌ను, దాని చైర్మన్ కూనం వీరభద్ర రావు, ఆయన కుమారుడు చౌదరి, మరికొందరిని నిందితులుగా పేర్కొంటూ FIR కూడా నమోదు చేసింది. అయితే, సేకరించిన శ్యాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిన సీబీఐ.. ఇప్పటికీ రిజల్ట్స్‌ రాలేదని చెబుతుండటం విశేషం.

మరోవైపు, ఎన్నికల సమయం కావడంతో.. ఈ అంశం పొలిటికల్‌గా మంటలు రాజేసింది. కంటైనర్‌లో సరుకు అధికార వైసీపీ వాళ్లదేననీ, ఏపీని డ్రగ్స్ కేంద్రంగా మార్చేశారనీ.. టీడీపీ, బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అయితే అదేస్థాయిలో ఈ ఆరోపణలను తిప్పికొట్టింది వైసీపీ. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బంధువుల పనేనంటూ.. రివర్స్‌ ఎటాక్‌ చేసింది. ప్రకాశం జిల్లా కు చెందిన కూనం వీరభద్రరావు.. గతంలో పురంధరేశ్వరి వియ్యంకుడికి చెందిన సంధ్యా మెరైన్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారనీ.. అదే కంపెనీలో ఆమె కుమారుడు చెంచు హితేశ్ కూడా డైరెక్టర్‌గా ఉన్నారనీ.. వైసీపీ నుంచి ప్రత్యారోపణలు వచ్చాయి. అలా ఈ వ్యవహారం.. తీరంలో పొలిటికల్‌ కెరటాలను పోటెత్తేలా చేసింది. సరిగ్గా దీనికి, ఎలక్షన్‌ ఎట్మాస్పియర్‌ కూడా తోడు కావడంతో.. పార్టీల మధ్య మాటల యుద్ధమే నడిచింది.

ఇవి కూడా చదవండి

పొలిటికల్‌గానే కాదు.. సామాజికంగానూ.. తీవ్ర రచ్చకు కారణమైన ఈ కేసులో.. ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. ఆపరేషన్ గరుడ అంటూ హడావుడి చేసిన సీబీఐ.. గమ్మున ఉండిపోయిందనే ప్రచారం జరుగుతోంది. విచారణ జరుగుతోందని చెబుతూ.. కేసు పురోగతికి సంబంధించి ఎలాంటి ప్రకటనా చేయకుండా మౌనం వహించింది. ఇంటర్ పోల్ నుంచి సమాచారం అందుకున్నాక కస్టమ్స్ సహకారంతో విశాఖ పోర్టులో కంటైనర్‎ను స్వాధీనం చేసుకున్నామని చెప్పిన సీబీఐ.. బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్ట్‌లో విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్సపోర్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ పేరు మీద దీన్ని బుక్‌ చేసినట్టు స్పష్టం చేసింది. ప్రాథమికంగా నార్కోటిక్స్ డ్రగ్స్ ఉన్నట్టు నిర్ధారించిన సీబీఐ.. ఆ తర్వాత కామ్‌ అయిపోయింది. మొదట్లో ఎంతో హంగామా చేసి.. ఇప్పుడు మౌనమే సమాధానం అంటోంది. దీనిపై సీబీఐ కేంద్ర యూనిటే దర్యాప్తు చేస్తోంది కాబట్టి.. లోకల్‌ సీబీఐ కూడా జోక్యం చేస్కోలేని పరిస్థితి. దీంతో ఈ కేసులో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు.

ఇంతకీ ఆపరేషన్‌ గరుడ.. ఆగిందా? కొనసాగుతోందా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పోనీ.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్‌ కంపెనీ దగ్గర ఏదైనా అప్‌డేట్‌ ఉందా? అంటే అదీ లేదు. ఆ సంస్థ ప్రతినిధులను సంప్రదించిన టీవీ9కి.. ఆశ్చర్యపోయే సమాధానం దొరికింది. రెండు నెలలుగా డ్రగ్ టెస్ట్‌కు సంబంధించి సీబీఐ నుంచి ఎలాంటి సమాచారం లేదనీ.. ఇంకొన్నాళ్లు చూసి తామే ఢిల్లీ వెళ్లి అధికారులను కలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అందులో డ్రగ్ అవశేషాలు లేనట్లయితే ఆ సరుకుని తిరిగి తమకు ఇచ్చేయాలని కోరుతామంటున్నారు.

ఆఖరికి, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే.. దర్యాప్తు సంస్థకు ఎదురెళ్లి కేసుకు సంబంధించిన అప్‌డేట్‌ వివరాలు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ, డ్రగ్స్‌ కంటైనర్‌ కేసులో.. సీబీఐ మాత్రం అస్సలు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డ్రగ్స్‌ ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించి ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేసిన సీబీఐ.. తుది పరీక్షల ఫలితాల కోసం ఇంత సమయం ఎందుకు తీసుకుంటోందన్నదే చర్చనీయాంశమవుతోంది. అప్పట్లో 2 నుంచి 4వారాలు అన్నారు.. ఇప్పుడు 8వారాలు దాటినా.. చడీచప్పుడు లేదు. ఆ ఫలితాలు రావడానికి ఇంకెంత సమయం పడుతుందో కూడా కచ్చితంగా చెప్పేవారు లేరు. దీంతో దర్యాప్తు సంస్థ తీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటర్ పోల్ సమాచారంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించిన సీబీఐ.. ఒకవేళ పట్టుబడింది డ్రగ్సేనని నిర్ధారణ అయినా ఎందుకు బహిర్గతం చేయడం లేదు? ఇందులో ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? అనే యాంగిల్స్‌లోనూ చర్చ నడుస్తోంది. డ్రగ్స్‌ డ్రగ్స్‌ అంటూ దేశమంతా ఏపీవైపు చూసేలా హడావుడి చేసినా.. ఇప్పుడు అందులో డ్రగ్స్‌ అవశేషాలు లేవని తేలిందేమోనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అందుకే, ఇప్పుడేం చేద్దామన్న సందిగ్ధంలో సీబీఐ మల్లగుల్లాలు పడుతోందా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎన్ని ప్రచారాలు జరిగినా.. ఆపరేషన్‌ గరుడకు సంబంధించి అసలు సంగతి తెలియాలంటే.. సీబీఐ నోరు విప్పాలి. దర్యాప్తు సంస్థేమో ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా వ్యవహరిస్తుండటం.. కొత్త చర్చకు ఆస్కారమిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..