AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాఖీ పండుగ వేళ తీవ్ర విషాదం.. మూడేళ్ల పాపను వదిలి గోదావరిలో దూకిన దంపతులు!

మూడేళ్ల చిన్నారిని వదిలి పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలం, చించినాడ బ్రిడ్జిపైనుంచి ఓ దంపతులు గోదావరిలోకి దూకారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు, చిన్నారిని సంరక్షణలోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలు లేదా ఆర్థిక సమస్యలు కారణమా అని దర్యాప్తు కొనసాగుతోంది. దంపతుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

రాఖీ పండుగ వేళ తీవ్ర విషాదం.. మూడేళ్ల పాపను వదిలి గోదావరిలో దూకిన దంపతులు!
Couple Jumps Godavari
Balaraju Goud
|

Updated on: Aug 28, 2026 | 8:28 AM

Share

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన దంపతులు గోదావరి నదిలో దూకి గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వంతెనపై వారి చిన్నారిని ఉంచి దంపతులు నదిలోకి దూకినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనాస్థలానికి చేరుకుని గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

గురువారం, ఆగస్టు 27 రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వేల్పూరుకు చెందిన దొడ్డా వెంకట ధనసాయి కృష్ణ అలియాస్ డీవీడీ (32), ఆయన భార్య శిరీష (28)గా గల్లంతైన వారిని గుర్తించారు. వీరికి కవల పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. డీవీడీ గతంలో గల్ఫ్‌కు వెళ్లి కొన్నేళ్ల పాటు అక్కడ పనిచేశారు. అనంతరం స్వగ్రామానికి తిరిగి వచ్చి వివాహం చేసుకున్నారు. కొంతకాలం హైదరాబాద్‌లో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత వేల్పూరు గ్రామంలో రెడీమేడ్ దుస్తుల దుకాణం నిర్వహించినట్లు తెలుస్తోంది.

అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల పాలైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ ఇంటిని కూడా విక్రయించినట్లు స్థానికులు తెలిపారు. సుమారు రెండు నెలలుగా భీమవరంలోని డీవీడీ పిన్ని ఇంట్లో దంపతులు ఉంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం రాత్రి దంపతులు తమ చిన్నారితో కలిసి చించినాడ బ్రిడ్జి వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. వంతెనపై చిన్నారిని ఉంచిన అనంతరం భార్యాభర్తలు ఇద్దరూ గోదావరి నదిలోకి దూకినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.

గల్లంతైన దంపతుల కోసం గజ ఈతగాళ్లతో పాటు కుటుంబ సభ్యులు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో ప్రవాహ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. మరోవైపు చిన్నారిని సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

దంపతులు తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయానికి అప్పుల బాధే కారణమా? లేక మరేదైనా కుటుంబ సమస్య ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో వేల్పూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us