పెళ్లి ఘడియా వచ్చేసిందే.. సందడిగా మారిన తెలుగు రాష్ట్రాలు.. ముస్తాబవుతున్న పెళ్లి పందిర్లు..
పెళ్ళి కళ వచ్చేసింది... నేటి నుంచి రెండు నెలలపాలు పెళ్ళిళ్ల సందడి అంగరంగ వైభవంగా జరగనున్నాయి... గత రెండేళ్ళపాటు కోవిడ్
పెళ్ళి కళ వచ్చేసింది… నేటి నుంచి రెండు నెలలపాలు పెళ్ళిళ్ల సందడి అంగరంగ వైభవంగా జరగనున్నాయి… గత రెండేళ్ళపాటు కోవిడ్ ఉధృతి కారణంగా ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్ల ఆశించిన మేరకు పెళ్ళిళ్ళు, శుభకార్యాలు జరగలేదు… ఆంక్షల మధ్య శుభకార్యాలు జరపడం ఇష్టం లేక చాలా మంది పెళ్ళిళ్ళు వాయిదాలు వేసుకున్నారు… ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది… నేటి నుంచి రెండు నెలలపాటు దివ్వమైన ముహూర్తాలు ఉండటంతో పండితులు ఆఘమేఘాలమీద ముహూర్తాలు పెట్టేస్తున్నారు… ఇక ఆంక్షలు లేవు… పెళ్ళి వారింట హంగులు, ఆర్భాటాలకు అవధులు లేవు… ఇంకేముంది అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేసుకునేందుకు వధూవరులు ముస్తాబవుతున్నారు…
శుభకృత్ నామ సంవత్సరంలో పెళ్ళిళ్ళు జోరుగా ప్రారంభమయ్యాయి… ఈనెల 14 నుంచి జూన్ 23వ తేది వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో వథూవరులు, బంధువులు మాంగళ్యం తంతునానేనా… అంటూ పెళ్ళి తంతుకు సిద్దమైపోతున్నారు… కళ్యాణమండపాలు పగలు, రాత్రి పెళ్ళి సందళ్ళతో కళకళలాడుతున్నాయి… ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు తొలగించడంతో అట్టహాసంగా, అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేసుకునేందుకు పెళ్ళి కుమారులు, పెళ్ళి కూతుళ్ళు సై అంటే సై అంటున్నారు… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండున్నర నెలల కాలంలో 2 లక్షల పెళ్ళిళ్లు జరుగుతాయని అంచనా కాగా ఒక్క ప్రకాశంజిల్లాలోనే ఈ వ్యవధిలో 6 వేల పెళ్ళిళ్ళకు ముహూర్తాలు పెట్టేసుకున్నారు… ఏప్రియల్ 14 నుంచి 25 వరకు, మే 4వ తేది నుంచి 26 వరకు , అలాగే జూన్ 1 నుంచి 24వ తేది వరకు ఈ మూడు నెలల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్ద ఎత్తున పెళ్ళిళ్ళకు సిద్దమవుతున్నారు…
కళ్యాణమండపాల్లోనే ఎక్కువ పెళ్ళిళ్లు..
ప్రకాశం జిల్లాలో 200 పైగా కళ్యాణమండపాలు ఉన్నాయి… ఒక్క ఒంగోలు నగరంలోనే 36 పెద్ద కళ్యాణమండపాలు ఉన్నాయి… ఎవరి తాహతుకు తగ్గట్టుగా ఉండే డిమాండ్, వసతులతోపాటు, వారి వారి ఆర్ధిక స్తోమతకు తగ్గట్టుగా కళ్యాణమండపాలను అలంకరిస్తున్నారు… ఒక్కో పెళ్ళి నిర్వహణ కోసం కేవలం మండపానికే 2 నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతోంది… వసతులను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ పెళ్ళిళ్లు కళ్యాణమండపాల్లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు… గత రెండేళ్ళుగా కరోనా కారణంగా కళ్యాణ మండపాలు ఎలాంటి శుభకార్యాలకు నోచుకోక బోసిపోయాయని కళ్యాణమండపాల నిర్వాహకులు చెబుతున్నారు… ఒక్కో కళ్యాణమండపంలో 50 మంది వరకు వివిధ విభాగాల కింద పనిచేసే వర్కర్లు ఉంటారని తెలిపారు… లైటింగ్, పూల అలంకరణ, ఈవెంట్ మేనేజర్లు, క్యాటరింగ్ ఇలా పనిచేసే కార్మికులకు ఈసారి మంచి ముహూర్తాలు ఉండటంతో పనులు దొరికాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పెళ్ళిళ్ల సీజన్‌లో ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది… పురోహితులు, వంట చేసేవారు, ఫోటోగ్రాఫర్లు, సప్లయ్ కంపెనీలు, లైటింగ్, పూల అలంకరణ, మంగళవాయిద్యకారులు, బ్యాండు మేళం, బ్యూటీషియన్లు, టైలర్లు, వస్త్ర వ్యాపారులు, బంగారు ఆభరణాల తయారీదారులు ఇలా అనేకమందికి పని దొరుకుతుంది… రెండేళ్ళుగా ముహూర్తాలు ఉన్నా శుభకార్యాలకు పరిమిత సంఖ్యలోనే పిలుపులు జరిగాయి… విదేశాల్లో ఉండే దగ్గరి బంధువులు కూడా వచ్చే వీల్లేకుండా పోయింది… దీంతో ఇళ్ళ వద్ద కేవలం 50 మంది అతిధుల సమక్షంలో వివాహాలు చేసుకున్న సందర్బాలు ఉన్నాయి… కరోనా ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వివామ అనుబంధ రంగాలకు చెందిన 50 వేల మంది కొన్నాళ్లు ఉపాధికి దూరమయ్యారు… ఇప్పుడు వీరంతా తాజా ముహూర్తాలపై ఆశలు పెట్టుకున్నారు… అయితే గతంతో పోలిస్తే 30 నుంచి 40 శాతం వరకు అన్ని ధరలు పెరగడంతో పెళ్ళి చేసుకునే వారు ఖర్చులను తగ్గించుకుంటున్నారని, దీంతో తమ ఉపాధి అవకాశాలకు గండి పడుతుందని వివాహ సంబంధిత వ్యాపారులు, కార్మికులు వాపోతున్నారు.
అయితే ఎన్ని ఖర్చులు తగ్గించుకున్నా పెళ్ళి భోజనం పెట్టే విషయంలో మాత్రం పెళ్ళి వారు వెనక్కి తగ్గేది లేదంటున్నారు… కాఫీలు తాగారా, టిఫినీలు చేశారా… అంటూ పెళ్ళి మండపాల్లో సందడి చేసేవారు అతిధులకు మర్యాదలు చేయడంలో ఎలాంటి లోపం చేయడం లేదు… ఇతర ఖర్చులు తగ్గించుకునైనా భోజనాలు మాత్రం బ్రంహాండంగా పెట్టాలని, భోజనాలు చేసినవారు తృఫ్తి చెంది వధూవరులను మనస్పూర్తిగా దీవించాలని కోరుకుంటున్నారు… అందుకు తగ్గట్టుగానే కూరగాయలు, నిత్యావసర వస్తువులు, వంటవారి కూలీ రేట్లు పెరిగినా భోజనం విషయంలో రాజీ పడట్లేదని క్యాటరింగ్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: suriya: తమిళ నూతన సంవత్సరం వేళ సరికొత్తగా సూర్య.. అభిమానులకు అలా విషెస్ చెబుతూ..
Simbu: ఆటో డ్రైవర్గా మారిన ఆ స్టార్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్..
PM Kisan: రైతులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. పీఎం కిసాన్ పథకానికి ఇక వీరు అనర్హులు..
Sunny Leone: సన్నీలియోన్ ఫాన్స్కు బంపర్ ఆఫర్.. క్రేజీ ఐడియా.. కానీ కండిషన్స్ అప్లై..