Andhra Pradesh: వారెవ్వా.. రూ.2.3 కోట్ల కరెన్సీ నోట్లతో బొజ్జ గణపయ్యకు అలంకరణ! ఎక్కడో తెలుసా
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడి గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో... అత్యంత్య వైభవంగా ఇక్కడ చవితి వేడుకలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా గణనాధుడి ఎత్తు పెంచుతూ వచ్చిన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకొని క్రమంగా ఎత్తు తగ్గిస్తూ వస్తోంది. అయితే ఖైరతాబాద్ వినాయకుడిని ఆదర్శంగా తీసుకున్న ఏపీ వాసులు మాత్రం అలంకరణ కోసం..
మంగళగిరి, సెప్టెంబర్ 13: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడి గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో… అత్యంత్య వైభవంగా ఇక్కడ చవితి వేడుకలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా గణనాధుడి ఎత్తు పెంచుతూ వచ్చిన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకొని క్రమంగా ఎత్తు తగ్గిస్తూ వస్తోంది. అయితే ఖైరతాబాద్ వినాయకుడిని ఆదర్శంగా తీసుకున్న ఏపీ వాసులు మాత్రం అలంకరణ కోసం వినియోగించే కరెన్సీ నోట్లను పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది ఏకంగా 2.3 కోట్ల రూపాయల నోట్లతో ప్రత్యేక అలంకరణ చేసి ఔరా అనుకునేలా చేశారు. ఎక్కడనుకుంటున్నారా…
ఖైరతాబాద్ వినాయకుడి తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కొలువుంటే… కరెన్సీ గణపతి ఏపీ రాజధాని సమీపంలో ఉన్న మంగళగిరిలో కొలువుదీరాడు. మంగళగిరిలోని మెయిన్ బజార్లో వ్యాపార వేత్త బాలాజీ గుప్తా ఆధ్వర్యంలో గత పద్దెనిమిదేళ్ళ నుండి గణపతి నవరాత్రులను నిర్వహిస్తున్నారు. మొదట ఇక్కడ గణపతిని ఆలంకరించడానికి కరెన్సీ నోట్లను ఉపయోగించడం బాలాజీ గుప్తాతోనే మొదలైంది. మొదట లక్ష రూపాయల కరెన్సీ నోట్లను వినాయకుడిని అలంకరించడానికి ఉపయోగించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా కరెన్సీ నోట్లను పెంచుకుంటూ పోతున్నారు.
గత ఏడాది రెండు కోట్ల రూపాయల నోట్లతో విఘ్నేశ్వరుడిని తీర్చి దిద్దితే ఈ ఏడాది ఏకంగా 2.3 కోట్ల రూపాయలను వినియోగించారు. 2050,100,200,500 నోట్లను అలంకరణ కోసం ఉపయోగించారు. మొత్తం కొత్త నోట్లను తీసుకొచ్చి దేవుడిని అలంకరించారు. ఇందుకు మంగళగిరి మెయిన్ బజార్‌లోని వ్యాపారులంతా సహకరిస్తారు. పాత నోట్లను ఇచ్చి బ్యాంక్ ల నుండి కొత్త నోట్లను తీసుకున్నారు. వాటిని వివిద రూపాల్లో దండలుగా కడుతూ అలంకరణ చేశారు. నోట్లతోనే కలువ పూల రూపాలను తయారు చేశారు. వాటిని వినాయకుడికి వేశారు. అదే విధంగా నోట్లతోనే ఆర్చ్‌లను కూడా నిర్మించారు. మొత్తం మీద గత కొంతకాలంగా బాలాజీ గుప్తా నిర్వహిస్తున్న ఈ వేడుకలను అందరిని ఆకట్టుకుంటున్నాయి. భారీ కరెన్సీ ఉపయోగిస్తుండటంతో పోలీసులు కూడా బందోబస్తు భారీగానే ఏర్పాటు చేశారు. ఈఏడాది మంత్రి నారా లోకేష్ కరెన్సీ గణపతిని దర్శించుకునేందుకు వస్తుండటంతో నిర్వాహకులు మరింత ఉత్సాహంగా గణనాధుడిని తీర్చి దిద్దుతున్నారు.