
Bhogapuram Airport: ఏపీ ప్రజలకు ఇది సంక్రాంతి కానుకగా చెప్పవచ్చు. ఎందుకంటే త్వరలో ఏపీలో మరో ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుంది. దీని వల్ల రాష్ట్రం ఆర్ధికంగా, పారిశ్రామికంగా మరింతగా అభివృద్ది చెందనుంది. ఈ ఎయిర్‌పోర్ట్‌తో అంతర్జాతీయ రవాణా కనెక్టివిటీ అందుబాటులోకి వస్తే కొత్త కంపెనీలు రాక, హోటళ్లు, ఆతిధ్య, పర్యాటక రంగం వృద్ది చెందనుంది. దీని వల్ల వేల మంది నిరుద్యోగులకు కూడా ఉపాధి లభించనుంది. ఇప్పటికే ఏపీలో చాలా జిల్లాల్లో ఎయిర్‌పోర్ట్‌లు ఉండగా.. ఇప్పుడు మరో కీలక ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి సిద్దమైంది. పనులు దాదాపు పూర్తవ్వడంతో ఆదివారం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ నేడు చివరి ట్రయల్ రన్‌ను పూర్తి చేసుకోనుంది. ఆదివారం ఎయిర్‌పోర్ట్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానం ఇక్కడ ల్యాండ్ కానుంది. ట్రయల్ రన్‌లో భాగంగా ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ఢిల్లీ నుంచి భోగాపురంకు చేరుకోనున్నారు. ఈ చివరి ట్రయల్ రన్ పూర్తైన తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సర్వీసులు అందించే విమానయాన సంస్ధలతో అధికారులు చర్చలు జరపనున్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఈ ఏడాది జూన్ 26వ తేదీన ప్రారంభించనున్నారు. ఇప్పటికే 96 శాతం పనులు పూర్తవ్వగా., తుఫాన్లను తట్టుకోలిగే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. రోజుకు 200 విమానాలు దిగేలా, ఏటా 20 వేల టన్నుల సరుకు ఎగుమతి చేసేలా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రాత్రిపూట ఏకంగా 18 విమానాలను పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక 14 ఇమిగ్రేషన్ సెంటర్లను ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఇక విశాఖ నుంచి ఈ ఎయిర్‌పోర్ట్‌కి సులువుగా వెళ్లేలా మూడు రోడ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఎయిర్‌పోర్ట్‌కి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. ఎయిర్‌పోర్ట్ లోపల అల్లూరి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు. గంటకు 10 నుంచి 12 విమానాలు దిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. తొలి ఏడాదిలో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు.