నెలకు రూ.1.20 లక్షల జీతంతో.. Bank of Indiaలో ఉద్యోగావకాశాలు
Bank of India Recruitment 2026: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో మొత్తం 779 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత కలిగిన వారు జులై 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) తీపికబురు చెప్పింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖల్లో క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్ట్రీమ్ కింద ఎంఎంజీఎస్-II, ఎంఎంజీఎస్-III, ఎస్‌ఎంజీఎస్-IV స్థాయిలలో మొత్తం 779 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా ఎంఎంజీఎస్-II విభాగంలో 677 పోస్టులు, ఎంఎంజీఎస్-IIIలో 61 పోస్టులు, ఎస్‌ఎంజీఎస్-IVలో 41 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 20, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 30, 2026 నుంచి ప్రారంభమైంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా సీఏ, సీఎంఏ-ఐసీడబ్ల్యూఏ, సీఎస్, సీఎఫ్‌ఏ వంటి ప్రొఫెషనల్ అర్హతలతో పాటు సంబంధిత పని అనుభవం కలిగి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జులై 20, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు అందిస్తారు. ఎంఎంజీఎస్-II పోస్టులకు నెలకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు, ఎంఎంజీఎస్-III పోస్టులకు రూ.85,920 నుంచి రూ.1,05,280 వరకు, ఎస్‌ఎంజీఎస్-IV పోస్టులకు రూ.1,02,300 నుంచి రూ.1,20,940 వరకు జీతంగా చెల్లిస్తారు. ఆన్‌లైన్ పరీక్ష తేదీ త్వరలో వెల్లడిస్తారు.
రాత పరీక్ష విధానం..
ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే రాత పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ (క్రెడిట్/బ్యాంకింగ్ సంబంధిత అంశాలు) నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. మొత్తం 125 మార్కులకు పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగం, మంచి వేతనం కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




