
శ్రీకాకుళం, నవంబర్ 28: గ్రామ దేవత ఆలయం నుంచి బుసలు కొడుతూ భారీ శబ్దాలు. నిమిషాల గడుస్తున్నా శబ్దాలు ఆగటం లేదు. అమ్మవారి ఆలయం నుంచి వింత శబ్దాలు ఏంటా అని దగ్గరకి వెళ్లి చూసిన స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు. చూస్తే భారీగా ఉన్న కొండచిలువ అక్కడ తిష్ట వేసి ఉంది. భారీ సైజులో ఉన్న రక్తపింజరను చూసిన స్తానికులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు పెట్టారు. తర్వాత మళ్ళీ తేరుకొని ఆలయంలో ఉన్న రక్తపింజరను బయటకు పంపించేందుకు తీవ్ర కసరత్తు చేశారు.ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కిలంత్ర గ్రామంలో చోటు చేసుకుంది.
ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదుగాని, భారీ రక్తపింజర గ్రామ దేవత ఆలయంలోకి చొరబడింది. అయితే ఆ సమయంలో గర్భ గుడి ప్రధాన తలుపులు మూసి ఉండటంతో లోపలకి వెళ్ళలేక అక్కడ ద్వారం వద్దే టచ్చాడుతూ స్థానికుల కంట పడింది. దాదాపు 10 అడుగుల పొడవు భారీ సైజులో ఉంటూ ఒక్కటే శబ్దం చేస్తూ భక్తులకు తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ భారీ రక్తపింజరను చూడటానికి గ్రామస్తులంత గుడి దగ్గరకు చేరుకున్నారు. అంత పెద్ద రక్తపింజరను చూసిన గ్రామస్తులు ఎవరు దానిని బయటకు పంపే సాహసం చేయలేకపోయారు.
దీంతో సుమారు మూడు గంటల పాటు ఆలయం వద్దే అది తిష్ట వేసింది. చివరకు కొందరు వ్యక్తులు దాన్ని బయటకు పంపే ప్రయత్నంలో రాళ్ళు విసిరి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే ఆలయం ప్రాంగణంలో దానిని చంపకూడదని కొందరు పెద్దలు సలహా ఇవ్వడంతో.. దానిని అక్కడ నుంచి తరిమేసేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించారు. చివరకు అది వచ్చిన మార్గంలోనే నెమ్మదిగా ఆలయం నుంచి బయటపడి, అక్కడ నుంచి సమీప పొలాల్లోకి జారుకుంది. దాంతో గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆలయ సమీపంలో ఉన్న నాగావళి నది కాలువ నుంచి రక్తపింజర వచ్చి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.