Andhra: మతి తప్పినదా.. మదమెక్కినదా.. ఎక్కడ ఉన్నామనే సోయి లేదా..?
వీడియోలు షూట్ చేయడం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఎన్ని లైక్స్, కామెంట్స్ వచ్చాయని పదే, పదే ఆరాటపడటం. ప్రజంట్ మెజార్టీ యువతకు ఈ మాయదారి రోగం సోకింది. అసలు ఎక్కడ ఉన్నాం.. ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మర్చిపోతున్నారు ..

అది దేవాలయం.. ఎతో ప్రాముఖ్యత, చారిత్రక నేపథ్యం ఉంది. అదే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గల పవిత్ర వేదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఎంతో మహిమాన్వితుడిగా భావించే స్వామి సన్నిధిలో కొందరు పిచ్చి చేష్టలు చేస్తున్నారు. బరి తెగించి పైత్యపు వీడియోలు షూట్ చేస్తున్నారు. ఇవి సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర ప్రదేశంలో ఇలాంటి రీల్స్ షూట్ చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు.
తాజాగా స్వామి సన్నిధిలో వెలసిన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఓ యువజంట హగ్ చేసుకుంటూ.. క్లోజ్‌గా ఉంటూ ఇబ్బందికరంగా ఉన్న వీడియోలు షూట్ చేశారు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గుడిలో ఎలా మెలగాలో తెలియదా అంటూ చివాట్లు పెట్టారు. ఇలాంటి వారిని వదిలేస్తే గుళ్లను కూడా పార్కుల మాదిరిగా చేస్తారంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దీంతో.. ఆ జంట తప్పు తెలసుకుని సారీ చెప్తూ చెప్తూ పోస్టు పెట్టింది. గతంలో కొండపైన కొందరు మద్యం సేవిస్తూ వీడియోలు తీశారు. ఇలా నరసింహకొండపై తరచూ నిఘా వైఫల్యం జరుగుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చకపోవడం.. సెక్యూరిటీ సిబ్బంది ఉదాసీనంగా వ్యహరించడమే ఇందుకు కారణమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
