AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి బాటలో రాజకీయ ప్రస్థానం.. విజయవాడ పీఠంపై వంగవీటి రాధా!

25 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధాకృష్ణ, ఇప్పుడు 47 ఏళ్లకు విజయవాడ మేయర్‌గా ఎన్నికయ్యారు. జనసేన అభ్యర్థిగా కూటమి తరఫున పోటీ చేసి గెలిచిన రాధాకృష్ణ, కాంగ్రెస్‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ప్రజారాజ్యం, వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ పార్టీలలో పనిచేసి ఇప్పుడు జనసేనలో విజయపథం చూశారు.

తండ్రి బాటలో రాజకీయ ప్రస్థానం.. విజయవాడ పీఠంపై వంగవీటి రాధా!
Vangaveeti Radha
Ram Naramaneni
|

Updated on: Nov 05, 2026 | 12:44 PM

Share

విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు కార్పొరేటర్‌గా మొదలైన ఆ కుటుంబ రాజకీయ ప్రస్థానం.. ఎమ్మెల్యే పదవి మీదుగా ఇప్పుడు నగర మేయర్ పీఠం వరకు చేరింది. తండ్రి వంగవీటి మోహన రంగా రాజకీయాల్లో సంపాదించుకున్న గుర్తింపును కొనసాగిస్తూ ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ మరో కీలక విజయాన్ని అందుకున్నారు. 25 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఇప్పుడు 47 ఏళ్లకు విజయవాడ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించారు. జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధా.. వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై 1,30,912 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావుకు 12,642 ఓట్లు వచ్చాయి.

రంగా కుటుంబం నుంచి రాజకీయాల్లోకి..

వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లోకి రావడానికి ముందే ఆయన కుటుంబానికి విజయవాడలో బలమైన రాజకీయ పునాది ఉంది. తండ్రి మోహన రంగా 1985లో విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన హత్య అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన తల్లి రత్నకుమారి కూడా అదే నియోజకవర్గం నుంచి 1989, 1994 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.

అయితే 1999 ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీలో చేరిన రత్నకుమారికి ఆ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఆమె స్థానంలో బరిలోకి దిగిన సినీ నటుడు కోట శ్రీనివాసరావు విజయం సాధించారు. ఈ పరిణామాల తర్వాత వంగవీటి కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు రాధాకృష్ణ సిద్ధమయ్యారు.

కాంగ్రెస్‌తో మొదలైన ఎన్నికల ప్రయాణం

2003 చివర్లో రాధాకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. డిసెంబర్ 26న మోహన రంగా వర్ధంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించిన సభలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, కాంగ్రెస్ నేత దాసరి నారాయణరావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

మరుసటి ఏడాదే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటికి ఆయన వయసు కేవలం 25 ఏళ్లు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం రాధాకృష్ణ రాజకీయ జీవితంలో తొలి పెద్ద మైలురాయిగా నిలిచింది.

ఓటములు.. పార్టీ మార్పులు.. ప్రచార బాధ్యతలు

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాధాకృష్ణ రాజకీయ ప్రయాణం ఒకే పార్టీలో సాగలేదు. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. తర్వాత 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి మరోసారి అదృష్టం పరీక్షించుకున్నప్పటికీ ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన.. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. 2024 ఎన్నికల సమయంలోనూ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కవచ్చని, మంత్రి పదవి కూడా రావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ చివరకు ఆయన రాజకీయ ప్రయాణం మరో మలుపు తిరిగింది.

జనసేనలో చేరికతో కొత్త ఇన్నింగ్స్

టీడీపీలో సుమారు ఏడేళ్లు కొనసాగిన రాధాకృష్ణ.. విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా మేయర్ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి వచ్చిన ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యేగా మొదలైన ఆయన ఎన్నికల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం చేరింది.

1981లో తండ్రి.. ఇప్పుడు కుమారుడు!

వంగవీటి కుటుంబానికి విజయవాడ నగర రాజకీయాలతో ఉన్న అనుబంధం ఈ విజయంతో మరోసారి తెరపైకి వచ్చింది. 1981లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మోహన రంగా కృష్ణలంకలోని 40వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచారు. అప్పటికి ఆయన ఓ హత్య కేసులో జైలులో ఉన్నప్పటికీ ఎన్నికల్లో విజయం సాధించడం అప్పట్లో ప్రత్యేకంగా నిలిచింది. కార్పొరేటర్‌గా మొదలైన మోహన రంగా రాజకీయ ప్రస్థానం తర్వాత ఎమ్మెల్యే స్థాయికి చేరింది. ఇప్పుడు అదే నగరంలో ఆయన కుమారుడు మేయర్ ఎన్నికల్లో గెలుపొందారు. తండ్రి నగర కార్పొరేటర్‌గా పనిచేసిన చోట కుమారుడు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం ఈ కథనంలో మరో ఆసక్తికరమైన అంశం.

చదువు మధ్యలోనే ఆగినా.. రాజకీయాలే లక్ష్యంగా

1979లో కృష్ణా జిల్లా పెనమలూరులో జన్మించిన రాధాకృష్ణ.. గుంటూరులో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం తమిళనాడులోని సేలంలో వినాయక మిషన్స్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివేందుకు చేరారు. అయితే వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి రాజకీయాల వైపు అడుగులు వేశారు. అలా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం ఇప్పుడు విజయవాడ మేయర్ ఎన్నికల్లో విజయంతో మరో మైలురాయిని చేరుకుంది.

Follow Us