Andhra: విజయవాడ టూ తిరుపతి.. ఇకపై నాలుగున్నర గంటలే.. రయ్..రయ్‌మని దూసుకెళ్లొచ్చు
విజయవాడ ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఇకపై విజయవాడ టూ తిరుపతి ప్రయాణం మరింత తగ్గనుంది. కేవలం నాలుగున్నర గంటల్లోనే మీరు శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చు. అదేంటో మరి.! ఆ విషయం ఈ వార్తలో చూసేద్దాం పదండి.! ఓ సారి లుక్కేయండి మరి.

విజయవాడ-బెంగళూరు మధ్య కొత్త వందేభారత్ ట్రైన్ పట్టాలెక్కనుంది. అదేంటి.! బెంగళూరుకు వందేభారత్ అయితే.. తిరుపతి టైటిల్‌లో పెట్టారనుకుంటున్నారా.! వయా తిరుపతి మీదుగా వెళ్లే ఈ ట్రైన్ శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ అందించనుంది. తిరుమల వెళ్లే భక్తులను తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేర్చనుంది. ఇప్పటికే విజయవాడ-బెంగళూరు వందేభారత్ ట్రైన్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్దం కాగా.. ఇది తొమ్మిది గంటల్లోనే గమ్యస్థానం చేరుకోనుంది. 7 AC చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ బోగీలతో ఈ ట్రైన్ నడపనున్నట్టు తెలుస్తోంది.
ఈ వందేభారత్ ట్రైన్ మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు నడవనుంది. ట్రైన్ నెంబర్ 20711తో విజయవాడలో ఇది ఉదయం 5.15 గంటలకు బయల్దేరి.. ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 20712 నెంబర్‌తో బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు స్టార్ట్ అయి.. విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది.
తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం స్టాప్‌లు కాగా.. విజయవాడ(ఉదయం 5.15) నుంచి తిరుపతి(ఉదయం 9.45)కి కేవలం నాలుగున్నర గంటలు మాత్రమే ప్రయాణం ఉండనుంది. ఇప్పటివరకు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లేవారికి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, మూడు రోజులు మాత్రమే నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ వందేభారత్ రైలు వస్తే.. ఇకపై ఆ ప్రయాణీకుల కష్టాలు తీరనున్నట్టే.




