అర్ధరాత్రి దోపిడీ దొంగల బీభత్సం.. ఇద్దరు వాచ్‌ మెన్లను హత్యచేసి హల్‌చల్‌..

|

Mar 01, 2023 | 8:36 PM

ఎట్టకేలకు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు పోలీసులు.. ఇద్దరూ మైనర్లుగా గుర్తించారు. ఏ1 పై గతంలో కేసులున్నాయనీ.. జ్యువైనల్ హోంకు గత కేసులో పంపించామన్నారు. అన్ని విభాగాలను రంగంలోకి దించి..

అర్ధరాత్రి దోపిడీ దొంగల బీభత్సం.. ఇద్దరు వాచ్‌ మెన్లను హత్యచేసి హల్‌చల్‌..
Murder In Guntur
Follow us on

గుంటూరు అంటే మిర్చి యార్డ్ ఫేమస్.. కానీ ఇప్పుడు దోపిడీలు, హత్యలు అని చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో కరుడుగట్టిన దోపిడీ దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. దండుపాళ్యం గ్యాంగ్‌ను మించిన ముఠా.. అర్ధరాత్రి నగరంలో తిరుగుతూ బీభత్సం సృష్టిస్తోంది. ఏకంగా ఇద్దరు వాచ్‌మెన్లను చంపేసి.. అడ్డొచ్చిన వారిపై తీవ్రంగా దాడి చేశారు. రాడ్లు కర్రలతో అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగుతూ.. షాపుల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఒక్కరోజులోనే ఈ ఘటనలు జరగడంతో నగరవాసులు వణికిపోతున్నారు. ఈ హత్యలు గుంటూరు ప్రజల్లో భయాందోళనలు పెంచాయి.

గుంటూరు పట్టణ ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ బైక్ షోరూం, అరండల్ పేటలోని లిక్కర్ మార్ట్ వద్ద పనిచేసే వాచ్ మెన్లు దొంగల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. షోరూం లోని బైక్స్ దొంగిలించేందుకు యత్నించిన దొంగలముఠా వాచ్ మెన్ బలమైన ఆయుధంతో తలపై కొట్టినట్టుగా తెలిసింది. దీంతో అతడు రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే బైక్స్ దొంగిలించేందుకు విశ్వప్రయత్నం చేసినా సాధ్యంకాకపోవడంతో దొంగలు అక్కడి నుండి వెళ్లిపోయారు.

ఇక అరండల్ పేటలోని లిక్కర్ మార్ట్ ను దోచుకునేందుకు కూడా దొంగలు ప్రయత్నించారు. అక్కడ కూడా వాచ్ మెన్ ను కిరాతకంగా హతమార్చారు. అనంతరం మార్ట్ లో చొరబడి మద్యం దోచుకెళ్లారు. ఈ రెండు ఘటనలతో గుంటూరులో భయానక పరిస్థితి నెలకొంది. దాదాపు పదిహేను నిమిషాల పాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన దుండగులు పోలీసుల జీపుపై కూడా రాడ్, హెల్మెట్ విసిరి పారిపోయారు.

ఇవి కూడా చదవండి

అక్కడ నుంచి శ్రీనగర్ కాలనీలోని మీ సేవా కేంద్రం షట్టర్ పగులగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి పాత గుంటూరు వెళ్లారు. ఐదు షాపుల్లో చోరీకి ప్రయత్నించారు. చేతికి అందినవి పట్టుకొని అక్కడ నుంచి పారిపోయారు. చివరకు తెల్లవారు జామున నాలుగు గంటల సయమంలోనూ చోరీకి యత్నించారు దుండగులు. సంఘం డెయిరీ షాపు తెరిచి స్టాక్ సర్దుకుంటున్న ఏసుబాబుపై రాడ్డుతో దాడి చేశారు. పట్టుకోబోయేంతలోనే బైక్ పై అక్కడ నుండి పారిపోయారు. ఎట్టకేలకు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్.. ఇద్దరూ మైనర్లుగా గుర్తించారు. ఏ1 పై గతంలో కేసులున్నాయనీ.. జ్యువైనల్ హోంకు గత కేసులో పంపించామన్నారు. అన్ని విభాగాలను రంగంలోకి దించి.. పన్నెండు గంటల్లోనే నిందితులను పట్టుకున్నాం‌మన్నారు.

రాత్రంతా నగరంలోనే తిరుగుతూ అలజడి సృష్టించారు. దొరికిన షాపును దొరికినట్టే దోచుకున్నారు. అడ్డొచ్చిన వారిని అడ్డంగా కొట్టి చంపేశారు. అసలే పేద కుటుంబాలు.. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు వాళ్లని. కుటుంబంలో మనిషిని పోగొట్టుకుని తీవ్ర శోకాన్ని అనుభవిస్తున్నాయి. ఆదుకునే చేతుల కోసం ఎదురుచూస్తున్నాయి.