Vijayawada, జూలై 27: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దొంగతనాలు హడలెత్తిస్తున్నాయి.ఐదు రోజుల క్రితం శివాజీ వీధిలో రిటైర్డ్ డిప్యూటీ తహశీల్దార్ వర ప్రసాద్ ఇంట్లో చోరీ మరువక ముందే తాజాగా మైలవరం బందగర్ ప్రాంతంలో రిటైర్డ్ ఎండీఓ బాల వెంకటేశ్వరరావు ఇంట్లో చోరీ జరిగింది.వరుసగా రెండు దొంగతనాలు,అదికూడా రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్ళల్లో జరగడంతో విశ్రాంత ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు.
మైలవరంలో నివాసముంటున్న బాలవెంకటేశ్వరరావు రిటైర్డ్ ఎండీఓ.విజయవాడ లో ఉంటున్న తమ కుమార్తె ప్రసవ సమయం కావడంతో బాల వెంకటేశ్వరరావు భార్య కుమార్తె దగ్గరకు వెళ్ళారు.ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం శనివారం కుమార్తె ప్రసవించడంతో తాను కూడా విజయవాడ వెళ్ళారు బాల వెంకటేశ్వరరావు.నిన్న సాయంత్రం మైలవరంలోని ఇంటి ప్రక్కన వారు ఫోన్ చేసి తలుపుతీసి ఉందని చెప్పడంతో హుటాహుటిన భార్యాభర్తలిద్దరూ ఇంటికి వచ్చి చూసే సరికి తలుపుకున్న గడియ విరగ్గొట్టి ఉండడంతో అవాక్కయ్యారు.ఇంట్లో బీరువాలన్నీ తెరిచి బట్టలు,సామాను గదినిండా చిందరవందరగా పడి ఉండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు బాల వెంకటేశ్వరరావు.రాత్రి పోలీసులు పరిశీలించి క్లూస్ టీం కి సమాచారమివ్వడంతో ఉదయాన్నే క్లూస్ టీం రంగంలోకి దిగి వేలిముద్రలు సేకరిస్తున్నారు.ఇల్లంతా చిందర వందర చేసిన దొంగలు మెయిన్ బీరువా బలంగా ఉండడంతో పగలగొట్టలేకపోయారు.
దీంతో చాలా పెద్ద దోపిడీ జరగకుండా తెరపడింది.లేకుంటే సుమారు 30లక్లల రూపాయల వరకూ నగదు,బంగారం చోరీకి గురై ఉండేది.ఇప్పటికి సుమారు 40గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు బాల వెంకటేశ్వరరావు దంపతులు.ఇదిలా ఉంటే ఐదు రోజుల్లో రెండు వరుస దొంగతనాలు,అదికూడా రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్ళను టార్గెట్ చేసి వారు ఇళ్ళల్లో లేని సమయంలో దొంగతనానికి పాల్పడడం విశ్రాంత ఉద్యోగుల గుండెల్లో భయం నెలకొంది.ఇళ్ళు విడిచి వెళ్ళాలంటే భయబ్రాంతులకు గురయ్యే పరిస్థితి నెలకొంది.వరుస దొంగతనాలతో మైలవరం ప్రజానీకం హడలెత్తుతుంది.