Andhra Pradesh: గుండెల్ని పిండేసే ఘటన.. నాటు వైద్యం వికటించి అన్నాచెల్లెళ్లు మృతి.. ఏం కాదులే అంటూ..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజల విద్య, వైద్యం కోసం ప్రత్యేక దృష్టి సారించి మెడికల్ క్యాంపులు, జగనన్న సురక్ష వంటి అనేక వినూత్న సంస్కరణలతో ముందుకు వెళ్తుంటే పలుచోట్ల స్థానిక అధికారుల నిర్లక్ష్యం.. కొందరు అమాయకులకు శాపంగా మారుతుంది. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల్లో నాణ్యమైన వైద్యంపై అవగాహన లేక నాటు వైద్యంను ఆశ్రయిస్తూ అమాయక ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజల విద్య, వైద్యం కోసం ప్రత్యేక దృష్టి సారించి మెడికల్ క్యాంపులు, జగనన్న సురక్ష వంటి అనేక వినూత్న సంస్కరణలతో ముందుకు వెళ్తుంటే పలుచోట్ల స్థానిక అధికారుల నిర్లక్ష్యం.. కొందరు అమాయకులకు శాపంగా మారుతుంది. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల్లో నాణ్యమైన వైద్యంపై అవగాహన లేక నాటు వైద్యంను ఆశ్రయిస్తూ అమాయక ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అలాంటి ఓ హృదయవిధార ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. కురుపాం మండలం పొలంగూడ అనే గిరిజన గ్రామంలో నాటువైద్యంలో భాగంగా వేసిన పసర మందు వికటించి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నాచెల్లెళ్లు మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేస్తుంది. పొలంగూడ గ్రామానికి చెందిన కొండగొర్రి రమేష్ , సుశీల దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఎనిమిదేళ్ల రాహుల్ అనే బాబు, ఐదేళ్ల శ్రీలేఖ అనే పాపకు పచ్చ కామెర్లతో కూడిన జ్వరం వచ్చింది.
రాహుల్ నీలకంఠాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతుండగా, శ్రీలేఖ అదే గ్రామంలో ఒకటో తరగతి చదువుతుంది. అనారోగ్య కారణంగా హాస్టల్‌లో ఉన్న రాహుల్ ఇంటికి వచ్చాడు. అలా వచ్చిన రాహుల్‌ను, అప్పటికే అనారోగ్యంతో ఉన్న శ్రీలేఖను ఇద్దరినీ తీసుకొని అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి వెళ్లకుండా తమకు తెలిసిన వారు చెప్పిన ప్రకారం ఒక నాటు వైద్యుడుని ఆశ్రయించారు తల్లిదండ్రులు. అలా వెళ్లిన ఇద్దరు చిన్నారులకు నాటువైద్యంలో భాగంగా అనేక ఆకులతో కలిపి తయారుచేసిన ఒక ఆకు పసర మందు ఇచ్చాడు నాటువైద్యుడు. అలా పసరు మందు తీసుకొని రాహుల్, శ్రీలేఖలతో కలిసి ఇంటికి చేరుకున్నారు తల్లిదండ్రులు.
అయితే పసరు మందు తీసుకున్న కొద్ది సేపటికే ఇద్దరు చిన్నారులు మరింత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరిగి నాటువైద్యుడుని సంప్రదించారు తల్లిదండ్రులు. పసరు మందు ఇచ్చిన తరువాత.. ఆరోగ్యం కుదుటపడే ముందు జబ్బు తీవ్రంగా కనిపిస్తుందని, కానీ పసరు మందు ప్రభావంతో జబ్బు తగ్గుముఖం పడుతుందనంటూ నాటు వైద్యుడు వారిని నమ్మించాడు. తల్లిదండ్రులు కూడా నాటు వైద్యుడు మాటలు నమ్మి ఆరోగ్యం విషమిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. అయితే పసరు మందు కాస్త వికటించి మరి కొంతసేపటికి తీవ్ర అనారోగ్యం పాలైన రాహుల్ ఈ నెల ఐదవ తేదీన మృత్యువాత పడ్డాడు.
ఈ క్రమంలోనే సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే రాహుల్ చెల్లి శ్రీలేఖ కూడా మరణించింది. ఇలా తమ కళ్ల ముందే తీవ్ర అనారోగ్యంతో బాధ పడి మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తు్న్నారు. నాటువైద్యం వికటించి ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారుల మరణం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. అత్యాధునిక టెక్నాలజీతో ప్రభుత్వం దూసుకుపోతుంటే క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అమాయక గిరిజనులు బలవుతున్నారు. ఇలాంటి ఘటనల పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని పలువురు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..