Andhra Pradesh: అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవాలు బలి.. తృటిలో తప్పించుకున్న రైతులు.. అసలేం జరిగిందంటే..?
అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవాలు బలయ్యాయి.. తృటిలో ఇద్దరు రైతులు ప్రాణాలతో బయటపడ్డారు. పోలవరం జిల్లా రాజవొమ్మంగిలో ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకి రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందడం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. వ్యవసాయానికి ఆధారమైన ఎద్దులను కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న బాధిత రైతును ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు చివరకు రెండు మూగజీవాల ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈ ఘటన పోలవరం జిల్లా రాజవొమ్మంగి పరిసరాల్లో చోటుచేసుకుంది. ఎడ్లబండిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక రైతు తన ఇంటి పునాది నిర్మాణం పనుల నిమిత్తం ఇసుక తెచ్చేందుకు ఎడ్లబండిపై బయలుదేరాడు. మార్గమధ్యంలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా చాలా కిందకు వేలాడుతూ ఉన్నాయి. అటుగా వెళ్తున్న ఎడ్లబండిలోని ఎద్దులకు ఆ విద్యుత్ తీగలు ఒక్కసారిగా తగలడంతో తీవ్రమైన కరెంట్ షాక్‌కు గురై, రెండు ఎద్దులూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. అదే బండిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
పట్టించుకోని అధికారులు.. కన్నీరుమున్నీరవుతున్న రైతు
వ్యవసాయ పనులకు ఆధారమైన, కంటికి రెప్పలా చూసుకుంటున్న రెండు ఎద్దులు కళ్లముందే విగతజీవులుగా మారడంతో బాధిత రైతు గుండెలవిసేలా రోదిస్తున్నాడు. కిందకు వేలాడుతున్న తీగలపై గతంలోనే పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా కనీస స్పందన కరువైందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల అలసత్వం వల్లే తనకు సుమారు రూ. 2 లక్షల వరకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని, జీవనాధారమే కోల్పోయానని వాపోయాడు.
స్థానికుల ఆగ్రహం.. తక్షణ పరిహారానికి డిమాండ్
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాల స్థానంలో మనుషులు బలయ్యుంటే బాధ్యత ఎవరిదని అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని, తీవ్రంగా నష్టపోయిన బాధిత రైతుకు తగిన నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
