Vijayawada: కష్టాల్లో ఉన్న యువతులే వారి టార్గెట్. మైనర్ బాలికలనూ వదలరు. పని చూపిస్తామంటారు. వేలల్లో జీతం అని మాటలతో వల వేస్తారు. వారి మాటలు నమ్మరో ఇక అంతే సంగతులు. ముంబైలో పని మాటున రెడ్ లైట్ ఏరియాకు అమ్మేస్తున్నారు. బెజవాడ కేంద్రంగా ముంబైకి సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసింది టీవీ9. మాయమాటలతో అమ్మాయిలకు ఎలా ఎర వేస్తున్నారో టీవీ9 నిఘాలో బట్టబయలైంది.
విజయవాడ టూ ముంబై.. ఇదేదో బస్సు లేదా ట్రైన్ సర్వీస్ కాదు. నిరుపేద యువతులను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న దుర్మార్గులు ఎంచుకున్న రూటు. అవును.. అమాయకులైన యువతులు, మైనర్ బాలికలకు డబ్బు ఆశ చూపి రెడ్ లైట్ ఏరియా కు తరలించేస్తున్నారు. టీవీ9 నిఘాకు అందిన సమాచారంతో పక్కా స్కెచ్‌తో ఈ ముఠా పోలీసులకు చిక్కింది. తల్లిదండ్రులు లేని యువతులు, బాలికలే వారి టార్గెట్. పని పేరుతో మాయమాటలు చెప్పి.. ముంబైకి తరలిస్తున్నారు. రెండు రోజుల వంట పని అని చెప్పి.. ఆ తరువాత వ్యభిచార గృహానికి తరలిస్తున్నారు. మత్తు మందు ఇచ్చి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. తాజాగా విజయవాడలో అమ్మాయిలకు ఎర వేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులకు పట్టించింది టీవీ9 నిఘా టీమ్. వీరిలో సింగ్ నగర్‌లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరి కారణంగా మోసపోయిన అనాథ బాలిక టీవీ9ని ఆశ్రయించడంతో.. ముఠా ఆగడాలు బయటపడ్డాయి. తనను ఎలా చిత్రహింసలకు గురిచేసారో ఏడుస్తూ బాలిక మొరపెట్టుకుంది.
అయితే, తాజాగా మరో యువతిని తరలించేందుకు ముఠా ప్లాన్ వేసింది. ఈ క్రమంలో టీవీ9 నిఘా టీమ్ వారిని ఫాలో అయ్యింది. భవానీపురం చర్చి సెంటర్ నుంచే ఓ యువతిని తరలించడానికి ఈ ముఠా ప్లాన్ చేసింది. ఇదిగో ఇక్కడ వారు ముందుగా సెట్ చేసుకున్న ఆటో రాగానే యువతితో సహా ఆటోలోకి ఎక్కారు. ఇద్దరు మగవారితో పాటు ఇక మహిళ కూడా యువతి తో పాటు ఆటోలో వెళ్ళింది. ఈ ఆటోను టీవీ9 నిఘా టీమ్ ఫాలో అయింది. నేరుగా నున్న వరకూ ఆటోలో వెళ్లిన ముఠా.. ఆ యువతిని ఒక మహిళకు అప్పగించింది. ఈ మహిళ పేరు లక్ష్మీ. ఒకప్పుడు విజయవాడలో ఉన్న లక్ష్మి.. ముంబై రెడ్ లైట్ ఏరియాలో కొంతమందితో సంబంధాలు పెట్టుకుంది. విజయవాడలో ముఠా తీసుకొచ్చిన యువతులను ముంబై కి తరలించడం, అక్కడి నుంచి వ్యభిచార గృహాలకు అమ్మేయడం ఈ లక్ష్మీ పని. నున్న నుంచి నేరుగా విజయవాడ చేరుకున్న సదరు ముఠాలోని మహిళ.. ఆ యువతిని ఒక హోటల్ కు తీసుకెళ్లింది. అక్కడి నుంచి ముంబై తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసింది. అయితే, దీనిపై టీవీ9 నిఘా టీమ్, గవర్నరుపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఈ ముఠా దారుణాలు ఎలా వెలుగులోకి వచ్చాయంటే..
సింగ్ నగర్ కు చెందిన మైనర్ బాలికకు తల్లిదండ్రులు లేరు. ఇది తెలిసి ఆ బాలికకు పని ఎర వేశారు ముఠా సభ్యులు. ముంబైలో వంట పని చూపిస్తానని.. నెలకు 40 నుంచి 50 వేల రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్పారు. డబ్బు ఆశతో చెప్పుడు మాటలు విని బాలికను లక్ష్మి చేతిలో పెట్టారు ఆమె బంధువులు. మూడు రోజులు వంటపని చేయించిన తర్వాత అసలు నరకం మొదలైంది. మత్తు ఇంజెక్షన్ లు ఇచ్చి పడుపు వృత్తిలోకి బలవంతంగా దించారు. నా వల్ల కాదని చేతులెత్తి ప్రాధేయపడినా తన గోడు పట్టించుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది సదరు బాలిక. తనలాంటి అమాయకులను ఎంతోమందిని విజయవాడ నుంచి ముంబైకి తరలించి బలవంతంగా మురికి కూపములోకి దించుతున్నట్లు చెప్పింది.
ఈ ముఠా ఎవరు..? ఎంతమంది అమాయకులను బలిచేశారు..?
పోలీసులకు దొరికింది లక్ష్మీ, ఆమెతో పాటు బాధిత యువతి మాత్రమే. మరి లక్ష్మి వెనుకున్నది ఎవరు..? బ్రోకర్లకు ఎంత ముట్టచెబుతున్నారు. పైగా ముంబై తరలించిన తర్వాత యువతుల అడ్రెస్ లు కూడా మార్చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇంత జరుగుతున్నా.. పోలీసులకు ఈ విషయం తెలియదా? లేక పోలీసులు కూడా వీరికి సపోర్ట్ చేస్తున్నారా? పోలీస్ స్టేషన్‌లో లక్ష్మి తీరు చూస్తే ఈ అనుమానం కూడా వస్తుంది. ‘‘మాకూ పోలీసులు తెలుసు.. మా దగ్గర ఎన్ని లక్షలు తిన్నారు’’ అంటూ పోలీసులతోనే వాగ్వివాదానికి దిగింది లక్ష్మి. నిందితురాలైన లక్ష్మీ మాటలను చూస్తే ఈ ముఠా వెనుక పెద్దల హస్తం కూడా ఉందనే అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసులో ఎలా తేలుస్తారో వేచి చూడాలి.
Also read:
Income Tax Password: ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాస్‌వర్డ్ మర్చిపోయారా..? ఇలా చేయండి