Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..
నాలుగు రోజులయింది.. రెండేళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి. ఎక్కడ ఉందో.. ఎలా ఉందోనని.. తల్చుకుంటూ కన్నతల్లి గుండె చెరువవుతోంది. కళ్ల ముందు ఎప్పుడు కనిపిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తోంది. మరోవైపు జాహ్నవి జాడ కోసం వందల మంది సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కొండలు ఎక్కి దిగుతున్నారు.. తోటలు జల్లెడపడుతున్నారు. ఎక్కడా పాప కాన రావడం లేదు. ఇక జాహ్నవి వెంట వెళ్లిన పెంపుడు కుక్కను అధికారులు బంధించారు. అదిచ్చే సిగ్నల్స్ ఏంటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారంతా.

నాన్నా.. నాన్నా అంటూ వెళ్లిన చిన్నారి.. తిరిగి వెనక్కి రాలేదు.. ఎక్కడ ఉందో.. ఎలా ఉందో.. 4 రోజులైనా జాడ లేదు.. చిన్నారితో పాటే పెంపుడు కుక్క కనిపించలేదు.. మూడు రోజుల తర్వాత ఇంటివైపు వచ్చిన శునకం.. ఏదో క్లూ ఇస్తుంది.. ఆ క్లూ ఏంటో తెలుసుకోవడం అధికారులకు పెద్ద టాస్క్‌గా మారింది..?
పాప తన దగ్గరకు రాలేదన్న తండ్రి
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహరంలో సుంకర భవాని -గణేష్ దంపతులు ఉంటున్నారు. వీళ్ల గారాలపట్టే జాహ్నవి. పామాయిల్ తోటలో కాపలాదారులుగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. చుట్టూ కొండలు.. తోటల మధ్య ఉన్న ఇంట్లో ఉంటున్నారు. ఈనెల 6న ఉదయం 11.30 గంటల సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చిన జాహ్నవి తండ్రి దగ్గరకు పరుగు పెట్టింది. కట్ చేస్తే.. పాప తన దగ్గరకు రాలేదని తండ్రి చెప్పడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే బంధువులు, గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. రెండున్నరేళ్ల బిడ్డ అదృశ్యం.. కన్నవాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
సెర్చింగ్‌లో 200 మందికి పైగా సిబ్బంది
గ్రామానికి చెందిన చెందిన ఒకరు కొండ ప్రాంతంలో పాప ఏడుపు వినిపించిందని.. అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పక్కనే ఉన్న కుక్కను చూసి భయపడ్డానని చెప్పాడతను. ఆ సమాచారంతో అందరూ ఆ ప్రాంతానికెళ్లి జల్లెడ పట్టారు. అయినా చిన్నారి జాడ దొరకలేదు. మరోవైపు జాహ్నవి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. పెద్దాపురం డివిజన్‌కి చెందిన 200మందికి పైగా పోలీసులు.. రెవెన్యూ సిబ్బంది కొండ ప్రాంతాలు, అటవీ మార్గాలు, పరిసర గ్రామాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టినా.. ఎలాంటి క్లూ దొరకలేదు.
జాహ్నవి ఆచూకీ తెలిపితే లక్ష నగదు బహుమతి
ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జాహ్నవి ఆచూకీ తెలిపిన వాళ్లకి లక్ష నగదు బహుమతి అందిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. అసలు జాహ్నవి ఇంకా కొండల్లోనే ఉందా? ఎవరైనా చాక్లెట్, బిస్కెట్ ఆశజూపి తీసుకెళ్లారా? అసలే అటవీ ప్రాంతం కావడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చుట్టూరా తోటలు.. మధ్యలో ఏపుగా పెరిగిన గడ్డి.. ఈ ప్రాంతంలో జాహ్నవి ఎంత దూరం వెళ్లి ఉంటుంది? మరోవైపు ఓపెన్ బారుబావులు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటన్నింటిని మూసివేశారా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. అధికారులు మాత్రం సాధ్యమైనంత త్వరగా చిన్నారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు.
లోకల్‌గా ఉండేవాళ్లెవరైనా తీసుకెళ్లారా?
చిన్నారి మిస్ అయి ప్రాంతాన్ని అణువణువు పరిశీలించారు. కుటుంబ సభ్యుల దగ్గర వివరాలు సేకరించారు. వాళ్లు ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయకపోవడంతో.. స్థానికంగా ఎవరైనా తీసుకెళ్లారా అన్న కోణంలోనూ అధికారులు ఆరాతీయడం మొదలెట్టారు. ఈ క్రమంలో పెట్ డాగ్ ప్రత్యక్షం కావడంతో అందరిలో ఆశలు చిగురించాయి. అయితే కనిపించిన వాళ్లపై దాడి చేసేందుకు ప్రయత్నించడం.. అంతలోనే మరో ప్రాంతానికి వెళ్లిపోవడం.. పాప ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది.
కొండ ప్రాంతంలో డాగ్‌స్క్వాడ్‌తో గాలింపు
రెండోసారి చిన్నారి ఇంటి సమీపానికి వచ్చింది శునకం. భవానీపై దాడి చేసి కొండ ప్రాంతానికి పరుగు తీసింది. అయితే దాడి సమయంలో ఆమె చున్నీని నోటితో లాగింది. డాగ్‌స్క్వాడ్ తో రాత్రి వరకు కొండ ప్రాంతంలో గాలించారు. అయినా నో యూజ్. రెండో సారి అదృశ్యమైన పెంపుడు కుక్కను డాగ్ క్యాచర్ బృందం పట్టుకుంది. తుని మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు ఆధ్వర్యంలో, సానిటరీ ఇన్‌స్పెక్టర్ సలీం పర్యవేక్షణలో జరిగిన ఆపరేషన్ శునకం చిక్కింది. అర్ధరాత్రి మరలా ఇంటి వద్దకు వచ్చిన కుక్కను సురక్షితంగా బంధించారు. చిన్నారి ఆచూకీ కోసం కుక్క కదలికలపై అధికారుల దృష్టి సారించారు. చిన్నారి కోసం పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కుక్క మళ్ళీ రావడంతో చిన్నారి సజీవంగా ఉంటుందని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.
దర్యాప్తులో డాగ్ కీలకంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాహ్నవిని ఎవరైనా అపహరించి ఉంటే.. శునకం వెంటనే ఇంటికి రావాలి. కానీ ఆలస్యంగా ఎందుకొచ్చింది? కొండ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి అదృశ్యమవడానికి ముందు చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తన చెల్లెలు నిద్రిస్తున్న ఊయలను ఊపుతూ అమ్మా పాలివ్వు అంటున్న ముద్దు ముద్దు మాటలు చూసి పాప క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నారు.
బంధించిన శునకం విజువల్స్ దిగువన చూడండి…
