కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని అత్యంత మహిమానిత్వ క్షేత్రంగా భావిస్తారు. ఏడుకొండలమీద కొలువైన వెంకన్నను దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. పిలిస్తే పలికే దైవం కొలువైన ఏడుకొండల మీదే దొంగలు హవా చూపించారు. దేవుడి ఆస్తిలోని బస్సునే చోరీ చేశారు. చివరకు చార్జింగ్ అయిపోవడంతో బస్సు ఆగింది. దొంగలు పరారయ్యారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఆదివారం తెల్లవారుజామున రెండు కోట్ల విలువైన శ్రీ వారి ఉచిత ఎలక్ట్రిక్ బస్సును దొంగలు చోరీ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ బస్సును నాయుడుపేట వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం జీఎన్‌సీ ప్రాంతంలో బస్సును దొంగిలించినట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాయుడుపేట బిరదవాడ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా దుండగులు బస్సును ఆపి..టిడ్కో ఇళ్ల మీదుగా పారిపోయారు. ఇది గమనించిన పోలీసులు బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఎలెక్ట్రిక్ బస్సు కావడంతో.. చార్జింగ్ ఉన్నంతవరకు దూసుకెళ్లింది. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోగానే ఆగిపోయింది. దీంతో దొంగలకు దిక్కు తోచలేదు.. బస్సును వదిలేసి పరారయ్యారు. జీపీఎస్ సాయంతో కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద తిరుమల ధర్మరథం బస్సును గుర్తించిన పోలీసులు, టీటీడీ అధికారులు బస్సును తిరుమలకు చేర్చారు.
తిరుమలలో ధర్మరథం బస్సు చోరీ ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా వైఫల్యం వల్లే బస్సు చోరీ జరిగిందని ఆరోపించారు. గతంలో కూడా టీటీడీ డాక్టర్ కారు చోరీ అయ్యిందని తెలిపారు. ఎన్ని జరుగుతున్నా టీటీడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
వారం రోజుల క్రితం టిటిడి హెల్త్ ఆఫీసర్ ఎలక్ట్రిక్ కారు కూడా చోరీకి గురైనట్టు గుర్తించిన పోలీసులు… దీనిపై ఆయన ఎలాంటి ఫిర్యాదు చేయకపోడంపై ఆరాతీస్తున్నారు. కారు చోరీకి పాల్పడ్డ దొంగ టిటిడి ట్రాన్స్ పోర్ట్ విభాగంలో అనధికారికంగా పనిచేస్తున్న యువకుడిగా గుర్తించారు. టీటీడీ ట్రాన్స్‌పోర్టు అధికారుల అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. వరుస చోరీలు జరుగుతున్నా ఫిర్యాదు చేయకపోవడం వెనుక కారణాలేంటని ఆరా తీస్తున్నారు. టీటీడీ భద్రత, నిఘా వైఫల్యం కారణంగానే దొంగతనాలకు పాల్పడుతున్నారని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వరుస చోరీలపై ఫోకస్ చేసిన అధికారులు చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..