AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మీనలగ్నంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే గతంలో జరిగిన ఎలాంటి పొరపాట్లు ఈ సారి తలెత్తకుండా, తిరుమల పవిత్రతను కాపాడడంతో పాటు సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా స్వామి దర్శనం కల్పించాలన్న సీఎం ఆదేశాలతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

Tirumala: తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
Tirumala Brahmotsavam
Raju M P R
| Edited By: Anand T|

Updated on: Sep 24, 2025 | 7:53 PM

Share

భక్తులు వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు ఈ ఏడాది 36 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసింది. 1.16 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, రోజూ 25 వేల SSD టోకెన్లు విడుదల చేయనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసి.. వీఐపీ బ్రేక్ దర్శనం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసింది. భక్తులకు ప్రసాదం అందించేందుకు రోజూ 8 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ రెడీ చేసింది.

గరుడసేవ రోజున 14 రకాల వంటకాలు

ఇక తిరుమలకు వచ్చే భక్తుల కోసం గరుడసేవ రోజున 14 రకాల వంటకాలను టీటీడీ ఏర్పాటు చేసింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రంలో రోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరగనుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా తిరుమలలో 24 ప్రాంతాల్లో సుమారు 4వేల వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో అలిపిరి లింక్ బస్‌స్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్, దేవలోక్, AP టూరిజం ఓపెన్ ఏరియాల్లో మొత్తం 5250 ద్విచక్ర వాహనాలకు, 2700 కార్లకు పార్కింగ్ స్థలం కేటాయించారు.

పార్కింగ్ ప్రదేశం నుంచి తిరుమలకు ప్రత్యేక బస్సులు

పార్కింగ్ ప్రదేశాల నుండి తిరుమలకు ఆర్టీసీ బస్సులను కూడా నడపనున్నారు. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల ద్వారా 1900 ట్రిప్పులు, గరుడసేవ రోజున 3200 ట్రిప్పులు తిరిగేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 2వేల మంది టీటీడీ భద్రతా సిబ్బంది, 4700 పోలీసు సిబ్బంది, 450 సీనియర్ అధికారులు విధులు నిర్వహించనున్నారు.

అవాంచనీయ ఘటనలు తలెత్తకుండా ప్రత్యేక నిఘా

తిరుమలలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నగరం వ్యాప్తంగా ఉన్నా 3,000 సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేశారు. పారిశుద్ధ్యం కోసం 2300 సిబ్బందితో పాటు, 960 మంది అదనపు సిబ్బంది నియమించారు. కల్యాణకట్టలో భక్తుల తలనీలాల సమర్పణకు అందుబాటులో 1150 మంది క్షురకులు ఉండనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 28 రాష్ట్రాల నుండి వచ్చిన 298 బృందాల ప్రదర్శనలు జరగనున్నాయి. గరుడసేవ రోజున 20 రాష్ట్రాల నుండి వచ్చిన 37 బృందాలు సంప్రదాయ, ఆధ్యాత్మిక కళారూపాల ప్రదర్శన చేయనున్నారు.

వైద్య శిభిరాల ఏర్పాటు

తిరుమలకు వచ్చే భక్తుల ఆరోగ్య దృష్ట్ర్యా వారు ఏవైనా అనారోగ్య సమస్యలకు గురైతే వెంటనే వైద్య సేవలు అందించేందుకు 60 మంది డాక్టర్లు, 60 మంది పారా మెడికల్ సిబ్బంది టీటీడీ ఏర్పాటు చేసింది. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 14 అంబులెన్స్ లు కూడా టీటీడీ ఏర్పాటు చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.