Grama Ward Sachivalayam: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలకు కొత్త రూపు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కీలక ముందడుగు వేసింది. సచివాలయాల పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా.. ఇప్పుడు దానిపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాటి పేర్లను స్వర్ణగ్రామం శాఖగా మార్చనునట్లు ప్రకటించారు. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ అవుతాయని తెలిపారు. ఒకటి లేదా లేదు రోజుల్లో దీనికి సంబంధించి జీవో జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిల్లో చాలా మార్పులు చేస్తుండగా.. ఇప్పుడు పేరును మార్చడం చర్చనీయాంశంగా మారింది.
కొత్త పేరు ఏంటంటే..?
అమరావతిలోని సచివాలయంలో బుధవారం కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వాటి పేరును స్వర్ణగ్రామంగా త్వరలో మార్చుతున్నట్లు చంద్రబాబు స్పష్టతిచ్చారు. వీటి పేరును మార్చుతారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. స్వర్ణంధ్ర విజన్-2047లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాను విజన్ యూనిట్లుగా ఉపయోగించుకోవాలని గతంలో చంద్రబాబు సూచించారు. విజన్ సాధించడంలో వీటి పాత్ర కీలకమని తెలిపారు. ఆ విజన్‌లో భాగంగా రాష్ట్రాభివృద్ది కోసం ప్రత్యేక ప్రణాళిక తయారుచేశారు.ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్చడం హాట్‌టాపిక్‌గా మారింది.
గ్రామ స్థాయిలో కీలకం
గ్రామ స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంతకముందు ఏదైనా ప్రభుత్వ సేవలు, సర్టిఫికేట్లు పొందాలంటే ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ రోజులపాటు తిరగాల్సి వచ్చేది. కానీ గ్రామ సచివాలయాలు వచ్చాక ఊర్లోనే ప్రజలు అన్నీ ప్రభుత్వ సేవలు పొందుతున్నారు. ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఇక్కడికి వెళ్లి దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే మంజూరు చేస్తున్నారు. అందుకేకాకుండా సచివాలయ ఉద్యోగులు నేరుగా ఇంటికి వచ్చి సేవలు అందిస్తున్నారు.




