Indian Railways: సమ్మర్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి శుభవార్త..
ఈ వేసవిలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మీకు శుభవార్త. తిరుమల వెళ్లేవారి కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చింది. స్కూల్స్, కాలేజీలకు సమ్మర్ హాలీడేస్ కావడంతో పెద్ద సంఖ్యలో తిరుమల దర్శనానికి రద్దీ పెరిగింది. దీంతో ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. వీరి కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి వచ్చింది. వేసవి సెలవుల కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు. దీంతో రైళ్లు ప్రయాణికులతో నిండిపోతుండటంతో ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి వెళ్లే రైళ్లల్లో నిరంతరం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రైల్వేశాఖ ఈ మార్గంలో ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు రద్దీ దృష్ట్యా మరికొన్ని రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
తిరుపతికి ప్రత్యేక రైళ్లు
తిరుపతి-చర్లపల్లి, చర్లపల్లి-తిరుచానూరు, తిరుపతి-అకోలా, నాందేడ్-తిరుచానూరు, కాకినాడ టౌన్-మైసూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఇవి సర్వీసులు అందించనున్నాయి. చర్లపల్లి-తిరుచానూరు రూట్లో ఏప్రిల్ 12 నుంచి 15 వరకు ప్రత్యేక రైళ్లు నడవనుండగా.. తిరుపతి-చర్లపల్లి మార్గంలో 14 నుంచి 16వ తేదీల మధ్య అందుబాటులో ఉంటాయి. ఇక తిరుపతి-శ్రీకాకుళం మధ్య హంసఫర్ వీక్లీ రైలు ప్రవేశపెట్టారు. శ్రీకాకుళం-తిరుపతి(17440) రైలు ఈ నెల 13న శ్రీకాకుళం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. ఇక తిరుపతి-శ్రీకాకుళం ట్రైన్(17439) తిరుపతిలో ఈ నెల 19న సాయంత్రం 4.55కి బయల్దేరుతుంది. ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకొట, యలమంచలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్త వలస, విజయనగరం, బీపురుపల్లి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు
అటు సమ్మర్ సందర్భంగా టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించాలనుకునేవారి కోసం భారత్ గౌరవ్ ప్రత్యేక టూరిస్ట్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 14 నుంచి జూన్ 12 మధ్య హైదరాబాద్ నుంచి నాలుగు రైళ్లు తిప్పనున్నారు. పూరి కోణార్క్-బైద్యనాథ్, థామ్-వారణాసి, అయోధ్య-ప్రయోగరాజ్ యాత్ర ఏప్రిల్ 28న ప్రారంభమవుతుంది. మే 7వ తేదీన ఇది ముగుస్తుంది. సికింద్రాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ రైళ్లలో జనరల్ టికెట్లతో పాటు త్రీ ఏసీ, టూ ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఇక హరిద్వార్-మాతా వైష్ణోదేవి-రిషికేష్ యాత్ర మే 12న ప్రారంభం కానుండగా.. మే 21న ముగస్తుంది. అటు అరుణాచలం-చిదంబరం యాత్ర మే 24న ప్రారంభం కానుంది. అటు యమునా నది పుష్కరాల కోసం ప్రత్యేక యాత్ర జూన్ 3న ప్రారంభమవుతుంది.
