Tirupati: తిరుపతిలో నాగుపాములు హల్‌చల్ చేసాయి. నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ద్విచక్రవాహనం లో నుంచి నాగుపాములు బయటపడ్డాయి. వినాయక చవితి కావడంతో ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ వద్ద పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన ఒక వ్యక్తి బైక్ లోకి రెండు నాగుపాములు చేరాయి. ఇది గమనించిన జనం రోడ్డుపై పరుగులు తీసారు. అతి కష్టం మీద ఒక పాము బైక్ నుంచి బయటకు తెప్పించ గలిగిన జనం మరో పాము ఎటు వెళ్ళిందో తెలియక హైరానా పడ్డారు. బైకును రోడ్డుపై పడేసి నానా అవస్థలు పడటంతో ఒక పాము బయటకు బుసలు కొడుతూ వచ్చింది. పక్కనే ఉన్న దుకాణం వైపు వెళ్లడంతో వెంటనే అప్రమత్తమైన నగర పాలక సిబ్బంది పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. దాంతో అక్కడకు చేరుకున్న పాములు పెట్టె వ్యక్తి ఎంతో చాకచక్యంగా పామును పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాడు. ఇదిలా ఉంటే మరో పాము ఏమైందో తేలిక జనం చాలా సేపు తికమక పడ్డారు. బైక్ లోనే పాము ఉండిపోయిందని భావించి బయటకు వస్తుందేమోనని చాలా సేపు చూసారు. అయితే బైకులో పాము అలాగే ఉందా… లేదా అని తెలియక పోవడంతో బైక్ యజమాని చాలా సేపటి తర్వాత ఇంటికి తోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకవేళ బైక్ లోనే పాము ఉండిపోయి ఉంటే స్టార్ట్ చేస్తే ఆ వేడికి పాము ఏమవుతుందోనన్న భయంతో బైకును తోసుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు నగరంలో ఒక్క సారిగా రోడ్లపై పాముల ప్రత్యక్షం అవ్వడం ఏంటని అంతా అనుకుంటున్నారు. అయితే వినాయక చవితి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి అమ్మకానికి తీసుకువచ్చి పూజా సామాగ్రితో ఈ పాములు వచ్చాయని తెలుస్తుంది. గణనాథుని పూజించేందుకు భక్తులకు అవసరమైన ఫలాలు, పత్రాలు, అరటి చెట్లు, మామిడి ఆకులు ఇలాంటి వాటితో తాము కూడా బొజ్జ గణపయ్య పూజకు పనికి వస్తానేమోనని వచ్చిన నాగు పాములు తిరుపతి మార్కెట్ వద్ద జనాన్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు పరుగులు కూడా పెట్టించాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :