AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ రెండు పూటలా అన్నప్రసాద వితరణ.. ఎప్పటినుంచంటే?

TTD anna prasadam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని టీటీడీ ఆలయాలలో మార్చి నెలాఖరు నుంచి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టీటీడీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ రెండు పూటలా అన్నప్రసాద వితరణ.. ఎప్పటినుంచంటే?
Ttd Anna Prasadam
Rajashekher G
|

Updated on: Jan 19, 2026 | 6:46 PM

Share

TTD annaprasadam: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త అందించింది. ఇప్పటి వరకు తిరుమలతోపాటు కొన్ని టీటీడీ ఆలయాల్లోనే అన్న ప్రసాద వితరణ జరుగుతుండగా.. ఇక నుంచి అన్ని టీటీడీ ఆలయాల్లోనూ భక్తులకు అన్న ప్రసాదం అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలలో మార్చి నెలాఖరు నుంచి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టీటీడీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

రెండు పూటలా అన్న ప్రసాదం

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ప్రస్తుతం టీటీడీలోని 56 ఆలయాలలో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందని, మార్చి నెలాఖరునాటికి అన్ని ఆలయాలలో రెండు పూటలా అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. అదేవిధంగా, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో టీటీడీ ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతి, బీహార్‌లోని పాట్నా, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెల్గాం ప్రాంతాలలో టీటీడీ ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి నిర్మాణాలకు స్థలాలను కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు. సంబంధిత రాష్ట్రాల అధికారులతో టీటీడీ అధికారులు చర్చించి, కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునే అంశాన్ని రాబోయే పాలక మండలి సమావేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

అదేవిధంగా చెన్నైలో కేటాయించిన స్థలంలో ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్‌లు, పరిపాలనా అనుమతుల అంశాలను టీటీడీ బోర్డు ఆమోదానికి తీసుకురావాలని ఆదేశించారు. రుషికేష్‌లోని పీఏసీ (Pilgrim Amenities Complex) కూలిపోయే స్థితిలో ఉందని పేర్కొంటూ, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన చేపట్టి వచ్చే ఫిబ్రవరి నెలలోపు నూతన పీఏసీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

టీటీడీ ఆలయాలలో నియామకాలు

టీటీడీలోని ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏప్రిల్ మాసంలో పరీక్షలు నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేయాలని ఆదేశించారు. వేద పారాయణదారులుగా ఎంపికైన వారిలో 164 మందిని టీటీడీ ఆలయాలలో నియమించగా, మిగిలిన 536 మందిని ఇతర ఆలయాలలో నియమించేందుకు వీలుగా ఫిబ్రవరి మాసంలో ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా 150 మంది అర్చకులకు, 68 మంది పోటు వర్కర్లకు ఫిబ్రవరి నెలలో మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగైన సదుపాయాలు, టీటీడీ సేవలు, సమాచారం తదితర అంశాలపై భక్తుల నుంచి వస్తున్న ఈ – మెయిల్స్‌ను విశ్లేషించి, పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు పంపాలని ఆదేశించారు. అలాగే భక్తులు కోరుతున్న తాజా సమాచారాన్ని టీటీడీ వెబ్‌సైట్‌లో నిరంతరం అప్‌డేట్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం, ఎఫ్‌ఏ అండ్ సీఏవో ఓ. బాలాజీ, సీఈ టి.వి. సత్యనారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.