Tirumala: తిరుమల శ్రీవారికి సేవ చేసేందుకు 17 ఏళ్ల పోరాటం చేసిన భక్తుడు.. చివరకు
తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనడానికి భక్తుడు చేసిన న్యాయ పోరాటం ఫలించింది. శ్రీవారి సన్నిధిలో నిర్వహించే తిరుప్పావడ, మేల్‌చాట్ వస్త్ర సేవల్లో పాల్గొనే అవకాశంకోసం 17 ఏళ్లు నిరీక్షించాడు ఆ భక్తుడు. ఆ వివరాలు ఏంటో పూర్తి కథనంలో తెలుసుకుందాం పదండి ..

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన చంద్రశేఖర్ దంపతులు, వారి కుమారుడు, కోడలు.. శ్రీవారి మేల్ చాట్, తిరుప్పావై సేవా టికెట్ల కోసం 2008 నవంబర్ 26న టీటీడీకి రూ. 21,250 డిడి రూపంలో చెల్లించారు. ఏళ్లు గడిచినా అటువైపు నుంచి స్పందిచకపోవడంతో.. చంద్రశేఖర్ టీటీడీపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో 2021 సెప్టెంబర్ 10 న సేవల్లో పాల్గొనేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. కోవిడ్ కారణంగా సేవలు రద్దు చేసి బ్రేక్ దర్శనం కల్పిస్తామని అప్పట్లో భక్తుడికి సమాచారం ఇచ్చింది టీటీడీ. దీంతో మహబూబ్ నగర్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు చంద్రశేఖర్.
2024 మే8న జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తి అనూరాధ తీర్పు వెలువరిస్తూ.. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు 4 రోజుల్లోగా శ్రీవారి సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని లేని పక్షంలో వారికి 20 లక్షలు చెల్లించాలని టీటీడీని ఆదేశించారు. జిల్లా కమిషన్ ఆదేశాలను సవాలు చేస్తూ.. టీటీడీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. అయితే వివాదాన్ని వివాదాన్ని జిల్లాలోనే పరిష్కరించుకోవాలని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ సూచించింది. ఈ నెల 15న మళ్లీ విచారణ చేపట్టిన జిల్లా వినియోగదారుల కమిషన్ టీటీడీ వైఖరిపై తీవ్రంగా మండిపడింది. గతంలో తాము ఇచ్చిన తీర్పుకు కట్టుబడి వారికి సేవల్లో అవకాశం కల్పించాలని ఆదేశించింది. అలా కాకపోతే భక్తులకు చెల్లించాల్సిన 20 లక్షల్లో 50శాతం డిపాజిట్ చేస్తారా లేదా జైలుకు వెళతారా అని ప్రశ్నించింది. దీనితో దిగివచ్చిన టీటీడీ అధికారులు వచ్చే ఆగస్ట్ 14, 15 తేదీల్లో వారికి సేవల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ టికెట్లు జారీ చేశారు.
ఇదంతా శ్రీవారి మహిమే అంటూ సుమిత్రశెట్టి, చంద్రశేఖర్ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భగవంతుడు తన సేవకు తమను రప్పించుకుంటున్నాడని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
