
ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నకిలీ సిఫారసు లేఖలతో శ్రీవారి దర్శనం చేయిస్తామని భక్తులను మోసగిస్తున్న ఇద్దరి దళారీలను అరెస్ట్ చేశారు తిరుపతి పోలీసులు. వీరిద్దరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తోపాటు ప్రజాప్రతినిధుల పేరుతో నకిలీ లేఖలను తయారు చేసి భక్తులను బురిడీ కొట్టిస్తున్నట్లు గుర్తించారు. వీళ్లు నాయుడుపేటకు చెందిన బల్లి ప్రవీణ్ కుమార్, చెంచు బాలాజీలుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
వీరు సూళ్లూరు పేట టిడిపి ఎమ్మెల్యే విజయశ్రీ, గూడూరు టిడిపి ఎమ్మెల్యే పాశంసునీల్ కుమార్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి పేర్లను దుర్వినియోగం చేస్తూ ఫేక్ లెటర్స్ ను తయారు చేశారు. దీంతో నిందితుల నుంచి ఫేక్ లెటర్స్ తో పాటు, బ్యాంక్ పాస్ బుక్స్, నగదు స్వాధీనం చేసుకున్నారు. టిటిడి విజిలెన్స్ నిఘాలో వెలుగు చూసిన ఈ వ్యవహారంపై గూడూరు వన్ టౌన్, తిరుమల టూ టౌన్ పీఎస్ లో కేసులు నమోదు అయ్యాయి.
మోసాలపై పోలీసుల ప్రకటన
తిరుమల శ్రీవారి దర్శనం కోసం దళారీలను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీవారి సేవా టికెట్లు టిటిడి అధికారిక వెబ్‌సైట్ లేదంటే కౌంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని.. ఎవరైన దర్శనాల పేరుతో డబ్బులు అడిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.