ప్రకాశం జిల్లా, సెప్టెంబర్ 17: మరణం కూడా వారిని విడదీయలేకపోయింది.. చావు కూడా వారి మధ్యలో చొరబడలేకపోయింది. చివరకు ఆ ముగ్గురు స్నేహితులూ కలిసే తనువు చాలించేలా విధి వక్రీకరించింది. వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు వినాయకుని విగ్రహాన్ని కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా ఆ మృత్యువు ఆ ముగ్గుర్నీ కబళించింది. ప్రకాశం జిల్లా నాగులుప్పల పాడు మండలం మద్దిరాలపాడు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు బాపట్ల జిల్లా కొరిశె పాడు మండలం పమిడి పాడుకు చెందిన స్నేహితులు మర్రి బోయిన గోపి (30), మర్రిబోయిన మణికంఠ (22), బత్తిన అరవింద్ (21) లుగా గుర్తించారు. వీరంతా గ్రామంలో వినాయక చవితి పండుగను ఘరంగా నిర్వహించుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఒంగోలులో వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేశారు. విగ్రహాన్ని వాహనంలో గ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామంలో చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు అందమైన, జీవం ఉట్టిపడుతున్న విగ్రహం కొనుగోలు చేశామన్నా ఆనందంతో ముగ్గురూ కలిసి బైక్‌పై తిరిగి గ్రామానికి బయలుదేరారు.
అయితే తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు దగ్గరకు రాగానే ఎదురుగా పంచరై ఆగి ఉన్న లారీని గమనించలేకపోయారు. ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుకనుంచి వేగంగా ఢీకొట్టారు. ఈప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. బైక్‌పై ఉన్న ముగ్గురి తలలు లారీ వెనుకభాగాన్ని బలంగా తాకడంతో తలలు పగిలిపోయి తీవ్ర రక్తస్రావం అయి మృతి చెందారు. సంఘటనా స్థలంలో ముగ్గురి మృతదేహాలు ఒకరిపై ఒకటి పడిపోయి చూసేవారిని కంట తడి పెట్టించాయి..మరణం కూడా వేరు చేయలేని విధంగా ఈ ముగ్గురి మృతదేహాలు పడి ఉన్న తీరు చూసి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఒంగోలు తాలూకా సిఐ భక్తవత్సలరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురు స్నేహితుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు.
కాగా, మృతులు అద్దంకి నియోజకవర్గంలోని పమిడిపాడు గ్రామానికి చెందిన వారు కావడంతో సమాచారం తెలుసుకున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఒంగోలు రిమ్స్‌లోని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుబాలను పరామర్శించారు. వినాయక చవితి ఉత్సవాలు చేసుకునేందుకు విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు వచ్చి మృత్యువాత పడిన ముగ్గురు యువకుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..