- Telugu News Andhra Pradesh News This Andhra Pradesh Village Doesn’t Allow Any Footwear, Residents Walk Barefoot
Andhra Pradesh: ఆ ఊళ్ళో చెప్పులు వేసుకుంటే ప్రాణం పోతుంది.. బయటవారికి కూడా ఇదే రూల్.. ఎందుకంటే..
ఆగ్రామం పొలిమేర వచ్చాక ఎంతటి వారైనా సరే చెప్పులు తీసి చేతపట్టుకోవాల్సిందే.. బయట వారైనా సరే ఆగ్రామానికి వస్తే చెప్పులు తీసి నడవాల్సిందే. ఆ గ్రామం లో వందల సంవత్సరాల నుంచి ఉన్న కట్టుబాటు. కాదంటే ప్రాణాలు పోయినట్టే అంటున్నారు అక్కడి గ్రామస్తులు.. అనడమే కాదు ఇలా చాలా ప్రాణాలు పోయాయని చెబుతున్నారు.
Updated on: Oct 23, 2023 | 6:59 PM

శాస్త్ర సాంకేతిక రంగాలలో మన దేశం దూసుకుపోతున్నా ఇక్కడ మాత్రం చెప్పులు తీసి 100 అడుగులు నడవాల్సిందే.. లేక పోతే మల్లయ్య స్వామి చెరువులో తోసేస్తాడు అనేది అక్కడ గ్రామస్తుల ప్రగాఢ నమ్మకం.

తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న చుట్టి గ్రామానికి వెళ్లాల్సిందే. ఈ గ్రామం పొలిమేరల్లో వారి గ్రామ దైవం మల్లయ్య స్వామి గుడి ఉంది. కాబట్టి గ్రామంలో అడుగుపెట్టిన గ్రామస్తులు అక్కడిదాకా చెప్పులు వేసుకుని వచ్చినా అక్కడ నుంచి మాత్రం వాటిని తీసి చేతిలో పట్టుకుని గ్రామంలోకి వెళతారు.. ఈ గుడి ముందరనుంచి చెప్పులు వేసుకొని నడవకూడదు.

దీనికి గాను ఆ గ్రామస్తులు ఓ హద్దు నిర్ణయించుకున్నారు. గుడి ముందర ఓ పెద్దరాయిని హద్దుగా నిర్ణయించుకున్నారు. ఆ హద్దు రాగానే చెప్పులు తీసి చేతపట్టుకుని నడుస్తారు. ఇక్కడ పనిమీద వచ్చిన పక్క గ్రామాలకు చెందిన వారికి కూడా ఇదే ఆచారం అమలు చేస్తున్నారు గ్రామస్తులు.

చెప్పులు వేసుకొని నడిస్తే ఏమవుతుంది ? గ్రామస్తుల్ని ప్రశ్నిస్తే అందరి నోటా ఒకే మాట వినిపిస్తోంది. మల్లయ్య వాళ్లని చెరువులో తోసేస్తాడని, రక్తం కక్కుకొని చనిపోతారనేది వారి నమ్మకం. లేదూ ఇది మీ మూఢ నమ్మకం అని ఎవ్వరైనా వారితో వారిస్తే ఆ గ్రామం నుండి బయటకు రావడం కూడా కష్టమే. ఎందుకంటే పిల్లల నుంచి పండు ముసలి వరకు ఆ గ్రామస్థులకు గుడి రాగానే చెప్పులు తీసి నడవడం సంప్రదాయంగా వస్తోంది. నెలసరి ఉన్న మహిళలు సైతం ఆ గుడి దరి దాపుల్లోకి రారు అంటే వాళ్ళ కట్టు బాట్లు ఎంత కఠినంగా ఉన్నాయో తెలుస్తుంది.

ఎందుకు ఈ కట్టుబాటు.. ఈ కట్టుబాటు అంటే వారు చెప్పేది ఇది మా ఆరాధ్య దైవం మల్లయ్య గుడి ప్రాంగణం కాబట్టి ఇక్కడ చెప్పులు వేసుకోకూడదు అనేది మా గ్రామం తరతరాలుగా పెట్టుకున్న కట్టుబాటు.

దానిని మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లలు అందరం ఆకట్టుబాటుని పాటిస్తాము. మానమ్మకం మాది అంటారు. కాదని మొండిగా వెళ్లిన వారు ప్రాణాలను కోల్పోయారని ఇకపై ఎవరికీ ఇలా జరగకూడదని ఇలా కఠినంగా ఉంటున్నామని గ్రామస్తులు అంటున్నారు.
