
అల్లూరి జిల్లా, ఆగస్టు 3: అల్లూరి ఏజెన్సీలో బైక్లు మాయమైపోతున్నాయి. అవి కూడా ఓన్లీ పల్సర్ బైకులే..! ఆ మూడు మండలాల్లో గత మూడు నెలల కాలంలో పదుల సంఖ్యలో బైకులు మిస్ అయ్యాయి. ఒకే తరహా బైక్లను ఎవరు ఎత్తుకు వెళ్తున్నారు..? కూపి లాగితే ఆ కేటుగాళ్ల ముఠా చిక్కింది. ఇంతకీ పల్సర్ బైక్ లే వాళ్ళ టార్గెట్ కారణం ఏంటో తెలుసుకుని పోలీసులే షాకయ్యారు. పల్సర్ బైకులు దొంగతనం చేస్తున్న ముగ్గురు యువకులను అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కుడు కామేశ్వరరావు, సిదిరి మహేష్, కొర్ర శ్రీను ముగ్గురూ ఓ ముఠా.. వీరంతా కలిసి పల్సర్ బైక్‌లనే టార్గెట్‌గా పెట్టుకుని చోరీ చేస్తున్నారు.
ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, జిమాడుగుల, చింతపల్లి మండలాలతో పాటు పరిసర గ్రామాల్లో టూవీలర్లు చోరీకి గురవుతున్నాయి. గత మూడు నెలల కాలంలో ఒకే తరహా బైకులు మాయమవుతున్నాయి. అవి కూడా పల్సర్ బైక్ లే చోరీ అవుతుండటం పోలీసులకు సవాల్ గా మారింది. ఒకానొక సమయంలో పల్సర్ బైక్‌లకు వాహనదారులు ప్రత్యేక నిఘా కూడా పెట్టాల్సి వచ్చింది.
తరచూ కేసులు నమోదు అవుతుండడంతో.. పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగాల్లోకి దింపారు. కూపి లాగితే.. ముగ్గురు దొంగల ముఠా సభ్యులు చిక్కారు. ముగ్గురిని కామేశ్వరరావు, మహేష్, శ్రీనుగా గుర్తించారు.. వాళ్ల నుంచి 10 పల్సర్ బైకులను స్వాధీనం చేసుకున్నారు.
పల్సర్ బైక్‌లను ఎందుకు ఎంచుకున్నారు అంటే.. వాటిని ఈజీగా చోరీ చేయవచ్చని సమాధానం ఇచ్చారు కేటుగాళ్లు.. ఎలా అంటే.. పల్సర్ బైక్ హ్యాండిల్ లాక్ ఈజీగా బ్రేక్ అయిపోతుందట.. కాలితో ఒక్క కిక్కు కొడితే తాళం విరిగి బండి కంట్రోల్లో వస్తుందట. అందుకే.. బైకులలో పల్సర్ బైక్ లను ఎంచుకొని మరి ఎత్తుకుపోతుంది ఈ ముఠా. పోలీసుల విచారణలో నిందితులే.. ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని పాడేరు ఏఎస్పి ధీరజ్ వెల్లడించారు.
చోరీ చేసిన బైక్ లన్ని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలైన ఒడిస్సా సరిహద్దు గ్రామాల్లో అమ్మేందుకు ప్లాన్ చేస్తు దొరికిపోయారు. ప్రధాన నింద్రుడు కామేశ్వరరావుపై గతంలో నెల్లూరు జిల్లాలో రెండు హత్య కేసుల్లో.. ఒక ఆరు దొంగతనం కేసులు నమోదు అయి ఉన్నాయి. జైలుకి వెళ్లి వచ్చిన కామేశ్వరరావు దొంగతనాలను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..