Andhra Pradesh: అందరి దష్టి ఆ వేదికపైనే.. పవన్, చంద్రబాబు ఏం చెప్పనున్నారు.?
ఆ తర్వాత లోకేష్‌తో కలిసి రెండు పార్టీల మధ్య గ్యాప్ లేకుండా ముందుకెళ్లేలా ఉమ్మడి సమన్వయ కమిటీని నియమించారు. రాష్ట్ర స్థాయిలో జేఏసీతో పాటు నియోజకవర్గ, మండల స్థాయిలో సమన్వయ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల ద్వారా రెండు పార్టీల నాయకుల మధ్య సమన్వయం కుదిరింది. అయితే ప్రజా సమస్యలపై పోరాటాల కోసం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయి...
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు గడువు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ పార్టీలన్నీ కీలక అంశాలపై దృష్టి పెట్టాయి. అభ్యర్ధుల ఎంపిక, మేనిఫెస్టో విడుదల పై కసరత్తు వేగవంతం చేశాయి. ఇప్పటికే తెలుగుదేశం-జనసేన పొత్తులో ఉండటంతో రెండు పార్టీలు ఎలా ముందుకెళ్లనున్నాయనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరి నెలలు గడుస్తున్నప్పటికీ ఉమ్మడి కార్యాచరణ విషయంలో సరైన స్పష్టత రావడం లేదు. ఇప్పటివరకూ పలు మార్లు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ భేటీ జరిగింది, రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో చంద్రబాబును కలిసిన తర్వాత పవన్ పొత్తు ప్రకటన చేశారు.
ఆ తర్వాత లోకేష్‌తో కలిసి రెండు పార్టీల మధ్య గ్యాప్ లేకుండా ముందుకెళ్లేలా ఉమ్మడి సమన్వయ కమిటీని నియమించారు. రాష్ట్ర స్థాయిలో జేఏసీతో పాటు నియోజకవర్గ, మండల స్థాయిలో సమన్వయ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల ద్వారా రెండు పార్టీల నాయకుల మధ్య సమన్వయం కుదిరింది. అయితే ప్రజా సమస్యలపై పోరాటాల కోసం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంపై ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వకపోయినప్పటికీ స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో ఇరు పార్టీల నాయకులు కలిసి పాల్గొంటున్నారు.
మొత్తంగా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. మరోవైపు పొత్తుల ప్రకటన తర్వాత చంద్రబాబు-పవన్ కలిసి ఇంతవరకూ ఒకే వేదికపైకి రాలేదు. ఇరువురు నేతలు పలుమార్లు సమావేశమైనప్పటికీ అంతర్గతంగా చర్చించుకున్నారే తప్ప బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. మీడియా ముందుకు కూడా రాలేదు, అయితే మొదటి సారి బుధవారం ఒకే వేదికపైకి వస్తున్నారు రెండు పార్టీల అధినేతలు. లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభా వేదికపై చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. ఇదే వేదిక నుంచి ఎన్నికల శంఖారావం పూరించేలా ఇరు నేతలు ముందుకెళ్తున్నట్లు సమాచారం.
భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇస్తారా.?
నారా లోకేష్ యువగళం పాదయాత్ర సోమవారంతో ముగిసింది. బుధవారం విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలోని పోలిపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది టీడీపీ. ఈ సభకు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, పార్టీ ముఖ్యనేతలు కూడా హాజరవుతున్నారు. మొదటిసారి చంద్రబాబు-పవన్ లు ఒకే వేదికపైకి వస్తుండటం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు కాబట్టి ఈ ఇద్దరు నేతలు ఏం చెబుతారనే చర్చ జరుగుతోంది. పొత్తుల విషయంపై వస్తున్న ఆరోపణలపై ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.
ఇక టీడీపీ-జనసేన పొత్తును ప్రజలు హర్షించడం లేదని అధికార వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. సీట్ల విషయంలో ఎలాంటి సందేశం కేడర్ కు ఇస్తారని కూడా రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.. ఇక బీజేపీతో పొత్తు విషయంలోనూ ఎలాంటి స్పష్టత లేదు, ఓవైపు పవన్ కళ్యాణ్ ఎన్డీయేలో ఉన్నానని చెబుతున్నారు, మరోవైపు టీడీపీతో పొత్తులో కూడా ఉన్నారు. ఈ అంశంపై పవన్ స్పష్టత ఇస్తారా…? ఇవేమీ లేకుండా కేవలం పాదయాత్ర, ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే మాట్లాడతారా…? ఇప్పుడీ అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి.
రాష్ట్రంలో ఎన్నికలకు మరో మూడునెలలు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికీ ఇద్దరు నేతలు కలిపి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు, మరి భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ వేదికపై నుంచి స్పష్టత ఇస్తారా అని రెండు పార్టీల కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని రెండు రోజుల క్రితం జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు-పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారని చెప్పారు. తాజా పరిణామాలతో టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణను లోకేష్ పాదయాత్ర ముగింపు సభ వేదికగా ప్రకటించే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..