
భీమిలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ దే అధికారమా? అనాదిగా ఆ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోందా? 83లో టీడీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని 2019 లో దక్కించుకున్న వైసిపి మళ్ళీ గెలుస్తామన్న ఆశతో ఉందా? లేదంటే రాజకీయాల్లోకి వచ్చిన ఐదు టర్మ్‌ల నుంచి ఓటమి ఎరుగని నాయకుడు బరిలోకి దిగాడు కాబట్టి అధికారం మాదే అని టీడీపీ భావిస్తోందా? ఈ ఆసక్తికరమైన అంశాన్ని ఒక సారి పరిశీలిద్దాం. మొదటి భీముని పట్నం, 2009 డీలిమిటేషన్ తర్వాత భీమిలి. రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం. మూడు లక్షల 60 వేల మంది ఓటర్లు. దాదాపుగా రెండు నియోజకవర్గాలతో సమానం. సముద్ర తీర పట్టణం, ఆద్యంతం ఆహ్లాదకర నియోజవర్గం, రూరల్, అర్బన్ మిక్స్డ్ ఓటింగ్, అత్యంత పొటెన్షియల్ నియోజకవర్గం, ఐటి హిల్స్, ఎండాడ, మధురవాడ లాంటి ఖరీదైన ప్రాంతాలు అన్నింటికి మించి వైసిపి అధికారంలోకి వస్తే కాబోయే రాజధాని ప్రాంతం కావడంతో విపరీతమైన హైప్ ఉన్న నియోజకవర్గం భీమిలి.
దీని హిస్టరీ ఒకసారి గమనిస్తే చాలా ఆసక్తికర అంశాలు మనకు గోచరిస్తాయి. 1952లో అరవై వేల ఓటర్లతో ప్రారంభమైన ఈ నియోజకవర్గంలో మొదట్లో స్వతంత్ర, ఆ తర్వాత ప్రజా సోషలిస్టు పార్టీఅభ్యర్దులు, ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్దులు గెలిచినా 1983 టీడీపీ ఆవిర్భావం తర్వాత 1999 వరకు వరుసగా నాలుగుసార్లు టీడీపీ గెలిచింది. అప్పట్లో 1989 – 94 తప్ప మిగతా మూడు టర్మ్‌లు అధికారంలో ఉండింది టీడీపీ. ఆతర్వాత 2004లో కాంగ్రెస్ అభ్యర్థి కర్రి సీతారాం గెలిస్తే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి అవంతి శ్రీనివాస్ పోటీచేసి గెలుపొందారు. అప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ప్రజారాజ్యం పార్టీను కాంగ్రెస్‌లో విలీనం చేయడం తో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మారిపోయారు అవంతి. ఆ తర్వాత 2014 లో గంటా శ్రీనివాస్ టీడీపీ నుంచి గెలుపొందగా టీడీపీ అధికారంలోకి వచ్చింది. అనంతరం 2019 లో మళ్ళీ అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడం, ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఏర్పడిపోయింది. అక్కడ గెలిచిన పార్టీ దే రాజ్యం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి గంటా – అవంతిలు టీడీపీ, వైసిపి నుంచి పోటీ పడ్డారు. ఇద్దరూ ఇప్పటివరకు ఓటమి ఎరుగకపోవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్నా.. ఇప్పుడు వైసిపి కూడా అక్కడ సంస్థాగతంగా బలపడింది. అందులోనూ ఆనందపురం, పద్మనాభం, భీమిలిలో ఎక్కువ రూరల్ గ్రామాలు ఉండడంతో సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మళ్ళీ మద్దతు ఇస్తారని నమ్ముతోంది వైసిపి. అదే సమయంలో ఇప్పటివరకు పోటీ చేసిన చోట మళ్ళీ చేయకుండా వరుసగా ఐదు ఎన్నికల్లో నెగ్గిన గంటా టీడీపీ నుంచి పోటీ చేయడంతో అటువైపు కూడా ఆసక్తి పెరిగింది. 2019 లో విశాఖ నార్త్ నియోజకవర్గంలో గెలిచి నియోజకవర్గానికి అసలు వెళ్ళని గంటాను గెలిపిస్తారా? లేదంటే నిరంతరం అందుబాటులో ఉండే తనకు ఓటేస్తారా? అంటూ అవంతి చేసిన అప్పీల్‌కు భీమిలి ఓటర్లు ఎలా స్పందిస్తారో, ఎవరు అక్కడ గెలుస్తారో, ఎవరూ అధికారం చేపడుతారో అన్న చర్చ జోరుగా మొదలైంది. దీంతో ఈ సీటు గెలుపుపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..