ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ అంటే ఆ సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. రంగు రంగుల ముగ్గులు, పిండివంటలు, కోడి పందేలు, హరిదాసుల కీర్తనలతో.. వైభవంగా ఉంటుంది. రాష్ట్రంలో పెద్ద పండుగ కావడంతో.. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారందరూ సొంతూళ్లకు వెళ్తుంటారు. దీంతో అధికారులు వారి కోసం ప్రత్యేకంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటారు. స్పెషల్ బస్సులు, ట్రైన్స్ వేస్తుంటారు. ప్రయాణికులు సురక్షితంగా ఇంటికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు. అయితే.. ప్రస్తుతం ఉన్న డిమాండ్ కారణంగా స్పెషల్ ట్రైన్స్ ఏ మాత్రం సరిపోవడం లేదు. జనవరి 10 నుంచి 20 వరకు రాకపోకలకు ఏ రైలులోనూ బెర్తులు లేవు. అన్నింటిలోనూ వెయిటింగ్ లిస్ట్ ఉంది. దీంతో బోగీల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. రద్దీ మార్గాల్లో నడుపుతున్న ప్రత్యేక రైళ్లు.. కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ లో అధిక ధరకు టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణాలు చేసేలా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.
మరోవైపు.. పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం సికింద్రాబాద్ నుంచి అదనంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్ ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు వీటిని నడపిస్తున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ ల నుంచి రాత్రిపూట బయలుదేరి ఉదయానికి గమ్యస్థానం చేరుకునేలా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్. రాకేశ్ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో జనరల్, రిజర్వ్ డ్ బోగీలు ఉంటాయని వివరించారు.
ప్రయాణికుల రద్దీ భారీగా ఉంది. భారీగా వెయిటింగ్ లిస్ట్ లు ఉన్నా.. దక్షిణ మధ్య రైల్వే కేవలం కంటి తుడుపుగా కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించడం గమనార్హం. టికెట్లు అందుబాటులో ఉంటే ఆర్టీసీలో లేదంటే, ప్రైవేటు ట్రావెల్స్ లో జర్నీ చేయాలి. దీంతో సంక్రాంతికి బస్సు ప్రయాణం మరింత భారంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..