Tirumala: తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో మూడు ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే..
రోజూ లక్షల మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేల మంది ప్రజలు తిరుమలకు వెళ్తుంటారు. దీంతో భక్తుల కోసం రైల్వేశాఖ రద్దీకి తగ్గట్లు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు మరో మూడు సర్వీసులను ప్రవేశపెట్టినట్లు తెలిపింది.

తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. తిరుమల వెళ్లే ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక ట్రైన్లను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో క్రిస్మస్, న్యూఇయర్ వస్తుండటంతో పాటు తిరుపతి వెళ్లేవారికి కోసం ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. తిరుమలకు రోజు లక్షలాది మంది ప్రజలు వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి ఇక వేల మంది తరచూ తిరుపతి వెళ్తుంటారు. దీంతో తిరుపతి వెళ్లే ట్రైన్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంతో అటువైపు ప్రత్యేక సర్వీసులను ఎప్పటికప్పుడు తీసుకొస్తుంది.
తాజాగా మరో మూడు స్పెషల్ రైళ్లను తీసుకొచ్చింది. తిరుపతి-చర్లపల్లి (07000) రైలు ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ మంగళవారం సాయంత్రం 16.30 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 8.15 గంటలకు చర్లపల్లికి వస్తుంది. ఇక చర్లపల్లి-తిరుపతి (07031) రైలు 19వ తేదీ నుంచి జనవరి 2 వరకు సర్వీసులు అందించనుంది. ఈ ట్రైన్ చర్లపల్లిలో సాయంత్రం 15.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 6.40 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
ఇక పంధర్‌పూర్-తిరుపతి (07032) ట్రైన్ 21వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు సర్వీసులు అందించనుంది. ఇది పంధర్‌పూర్‌లో రాత్రి 20.00 గంటలకు బయల్దేరి తర్వాత రోజు రాత్రి 22.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని రైల్వేశాఖ వెల్లడించింది. ఈ ట్రైన్లు దాదాపు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.




