
గుంటూరు సంపత్ నగర్‌లో నిన్న నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పుట్టిన రోజు కారణంగా ఆయన ఇంటి వద్ద కోలాహలంగా ఉంది. పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఇంటి వద్దకు చేరుకున్నారు. అభిమానులతో పాటు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు తరలి వచ్చారు. వచ్చిన వారందరూ ఎవరి హాడావుడిలో వారుండగా ఒక్కసారిగా కలకలం రేగింది. ఒక కార్యకర్త జేబులో చేయి పెట్టి పర్స్ కొట్టేసేందుకు ప్రయత్నం చేశాడో ఓ యువకుడు. ఇంకేముంది ఆ యువకుడిని పట్టుకున్నారు. అతనితో పాటు మరొక యువకుడు కూడా అక్కడికి వచ్చాడు. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసే లోపే పారిపోయాడు. దీంతో మేయర్ బర్త్ డే వేడుకల్లోకి ఒక ముఠా జొరబడిందని గుర్తించిన కార్యకర్తలు యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే ఆ యువకుడు తాడేపల్లి నుండి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
గుంటూరులో ఈ మధ్య కాలంలో బహిరంగంగా జరిగే బర్త్ డే పార్టీలు, రాజకీయా పార్టీల సమావేశాల్లో పిక్ పాకెటర్స్ గొడవ ఎక్కువైపోయింది. వందలాది మంది గుమికూడగానే జేబు దొంగల ముఠా వారిలో కలిసిపోతున్నారు. అందినకాడికి దోచుకొని అక్కడ నుండి పారిపోతున్నారు. వీరంతా ఒకే గ్యాంగ్‌గా పోలీసులు భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన బస్సు యాత్రల్లోనే చాలామంది తమ జేబులను ఖాళీ చేసుకున్నారు. ఈ సంఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ పోలీసులు వీరిని పట్టుకోలేకపోతున్నారు. సాధారణ కార్యకర్తలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులను టార్గెట్ చేస్తూ వీరి చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
అయితే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు పార్టీలు, సమావేశాలు జరిపే చోట సంబంధిత ముఠా ఫోటోలను ఏర్పాటు చేయాలని డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వ అధికారిక మీటింగులైతే భారీగా జనం గుమిగూడటంతో లక్ష రూపాయలకుపైగా టార్గెట్ గా పెట్టుకొని వీరు పిక్ పాకెటింగ్‌కి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చాలమంది పర్స్‌లలో నగదు కంటే ఎక్కువుగా క్రెడిట్ కార్డులు, ఏటిఎం, ఐడెంటిటీ కార్డులు పెట్టుకుంటున్నారు. అవి కూడా చోరికి గురువుతుండటంతో వాటిని పోగొట్టుకున్న వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..