Simhachalam Chandanotsavam: సింహాద్రి అప్పన్న చందనోత్సవ గందరగోళంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేళ భక్తుల ఆగ్రహం కట్టలు తెచ్చుకోవడం.. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద కన్నెర్ర చేయడం జరిగింది. కొండపైకి వెళ్లడానికే గంటన్నర పట్టడం.. గర్భాలయంలో పోలీసులు కూడా తచ్చాడటం.. భారీగా జరుగుతున్న పైరవీలు.. లాంటి ఘటనలతో స్వామివారికి చిర్రెత్తుకొచ్చింది. ఆలయ ప్రాంగణంలోనే అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. దర్శనానికి ఎందుకు వచ్చానా అనిపిస్తోందంటూ ఆయన ఆవేదన చెందిన వీడియో.. ఆగమేఘాల మీద వైరలైంది.
అదేసమయంలో.. నిజరూపదర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తారని తెలిసినా.. సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపించాయి. ఆరునెలల నుంచి ఈవో ఎందుకు లేరన్న ప్రశ్న.. ప్రభుత్వానికి తాకిందో లేదోగాని.. స్వామీజీ ఫైరింగ్ వీడియో అధికారులకు మాత్రం బాగానే తాకింది. వెంటనే అంతరాలయ దర్శనం ఆపేసి.. రద్దీ నియంత్రణకు ప్రయత్నించారు. అలాగే.. సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో మరో అపచారం జరిగింది. స్వామి నిజరూపదర్శనం వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది.
పవిత్రమైన అప్పన్న నిజరూపదర్శనం సోషల్ మీడియాలో వైరల్ కావడంపై భక్తులు మండిపడ్డారు. దాంతో.. సింహాచలం దేవస్ధానంలో అపచారాలు, చందనోత్సవ వైఫల్యాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సింహాచలంలో వరుస ఘటనలపై విచారణ చేపట్టారు జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్. దేవస్ధానంలో సీసీఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలించారు. చందనోత్సవం టిక్కెట్లు భారీగా రీసైక్లింగ్ జరిగినట్టు యంత్రాంగం భావిస్తోంది.. ఆ దిశగా బాధ్యులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.
అంతరాలయం వీడియోలు రికార్డింగ్, బయటకు రావడంపై దృష్టి సారించిన అధికారులు.. ఆ దిశగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక.. గతేడాది కూడా ఇలాంటి వీడియో వైరల్ కావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతరాలయ దర్శనమే అపచారానికి అసలు కారణమంటున్నారు భక్తులు. గతేడాది వీడియో తీసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతవుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. స్వామివారి అంతరాలయ వీడియోలు బయటకు రావడం అపచారమంటున్నారు పూజారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..