
టిడిపి అధినేత చంద్రబాబు పోటీలో ఉన్న కుప్పం ఫైట్ ఆసక్తికరంగా మారింది. కుప్పంను టార్గెట్ చేసిన పెద్దిరెడ్డి చంద్రబాబుకు చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే టిడిపి లక్ష ఓట్ల టార్గెట్‌ను రీచ్ కావాలని చూస్తోంది. వైసీపీని గెలిపించే బాధ్యత పెద్దిరెడ్డి భుజానికి ఎత్తుకుంటే చంద్రబాబు గెలుపు కోసం నారా ఫ్యామిలీ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా పట్టు నిలుపుకునేందుకు టిడిపి, పట్టు సాధించేందుకు వైసిపి ప్రయత్నిస్తుంటే మధ్యలో లక్ష్మీపార్వతి ప్రచారం వైసీపీ కేడర్‌లో కొత్త జోష్ ను తీసుకొచ్చింది. దీంతో ఈ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.
చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ ఎన్నిక ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. 1989 నుంచి వరుస విజయాలు నమోదు చేస్తున్న చంద్రబాబుకు 2024 ఎన్నికలు సీరియస్‌గా మారాయి. గతం కంటే భిన్నంగా టిడిపి కేడర్ ఈ ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోగా చంద్రబాబు గెలుపు కోసం నారా, నందమూరి ఫ్యామిలీలు రంగంలోకి దిగాయి. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిసారి చంద్రబాబు నామినేషన్ వేయడానికి కూడా కుప్పంకు రానీయకుండా గెలిపించిన స్థానిక నాయకత్వం ఈసారి పంథా మార్చింది. నామినేషన్ డబ్బులు, ఎన్నికల ఖర్చు చందాలు వేసుకొని ఇప్పటిదాకా గెలిపిస్తూ వచ్చిన కుప్పం కేడర్ ఈ ఎన్నికల్లో లక్ష ఓట్లు టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు, లక్ష మెజార్టీ బాధ్యత తీసుకున్న కుప్పం టిడిపి నాయకత్వానికి నారా భువనేశ్వరి దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు తరుపున నామినేషన్ వేసిన భువనేశ్వరి ఆ తర్వాత సోదరుడితో కలిసి కుప్పంలో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో విస్తృత ప్రచారం చేసి కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు షాక్ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు వైనాట్ 175 అనడంతో అలర్ట్ అయిన టిడిపి.. కుప్పం ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రబాబు గెలుపు బాధ్యతను స్థానిక నాయకత్వానికి అప్పజెప్పి ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న టిడిపి హై కమాండ్.. 2024 ఎన్నికల్లో స్వయానా అన్ని విషయాలను పర్యవేక్షిస్తుంది. టిడిపి ఎమ్మెల్సీ శ్రీకాంత్‌తో పాటు స్థానిక నేతలను సమన్వయం చేసే బాధ్యతలు తీసుకున్న నారా భువనేశ్వరి లక్ష ఓట్ల టార్గెట్‌పై దిశా నిర్దేశం చేశారు. రెండ్రోజుల క్రితం కుప్పం, రామకుప్పం, శాంతిపురం మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నారా భువనేశ్వరి తమ చివరి శ్వాస వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అవసరమని ప్రచారం చేశారు. ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర తలరాతను మార్చాలన్న భువనేశ్వరి మే 13న రాక్షస పాలనకు ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. ఇక చంద్రబాబు వరుసగా 8వ విజయం కోసం నారా, నందమూరి కుటుంబాలు కుప్పంలో కుస్తీ పడుతుంటే వైసీపీ కోసం లక్ష్మీపార్వతి కుప్పంలో ఎంట్రీ ఇచ్చారు.
కుప్పంలో చంద్రబాబును ఓడించి వైసిపి అభ్యర్థి భరత్‌ను గెలిపించాలని లక్ష్మీపార్వతి ప్రచారం చేశారు. నాలుగురోజుల క్రితం కుప్పంలో పర్యటించిన లక్ష్మీ పార్వతి చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమేనంటూ జనంలోకి వెళ్లి చెప్పే ప్రయత్నం చేశారు. కుప్పం ప్రజలను 35 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారని, 35 ఏళ్లుగా దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తున్నారని లక్ష్మీపార్వతి ప్రచారం నిర్వహించారు. కుప్పంవైపు దేశమంతా చూస్తోందన్న లక్ష్మీపార్వతి.. రైతులను మోసం చేసిన చంద్రబాబుకు ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. మరోవైపు చంద్రబాబుకు రాజకీయ బద్ధశత్రువు పెద్దిరెడ్డి కుప్పంను టార్గెట్ చేయడంతో కుప్పం హాట్ సీట్‌గా మారింది. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ సీఎం జగన్ చెప్పడం, మంత్రి పెద్దిరెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో బిగ్ ఫైట్‌గా మారింది.
ఈ నియోజకవర్గంలో దాదాపు 2.20 లక్షల ఓటర్లు ఉన్నారు. అందులో 65 వేలకు పైగానే వన్నె కుల క్షత్రియ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు వీరే కీలకం కానున్నారు. ఈ ఎజెండాతోనే బీసీలను బరిలో దింపిన వైసీపీ వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ భరత్‌ను అభ్యర్థిగా నిలిపింది. కుప్పంలో వైసీపీ గెలుపు బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి అప్పజెప్పిన హై కమాండ్ చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో గట్టి పోటీ నిచ్చింది. కుప్పంకు 5 ఏళ్లలో సీఎం జగన్ చేసిన అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న వైసీపీ.. తమకు పేద ప్రజలే స్టార్ క్యాంపెనర్లు అంటూ ముందుకు పోతోంది. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా చంద్రబాబును గెలిపించినా కుప్పం అభివృద్ధికి ఆయన చేసింది ఏమీ లేదని చెబుతోంది వైసీపీ. హంద్రీనీవా పూర్తి చేశామని, కుప్పంను మున్సిపాలిటీగా, డివిజన్ కేంద్రంగా చేసి అభివృద్ది పథంలో ముందుకు వెళ్తున్నామని చెబుతోంది. ఎక్కడో సంక్రాంతి సంబరాలకు సొంత నియోజకవర్గానికి వచ్చే చంద్రబాబును పక్కన పెట్టి నిత్యం ప్రజల మధ్యనే ఉండే ఎమ్మెల్సీ భరత్‌ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..